వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా విడతల వారిగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ములుగు రోడ్ లోని ఎల్. బి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులను సెంట్రల్ జోన్ డీసీపీ ముఖ్య అతిధిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు.
వరంగల్, హనుమకొండ డివిజన్లకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ జూలై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అందుకు అనుగుణంగా జూలై 1వ తేది నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.
కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడతలవారీగా శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత , భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని సూచించారు. కొత్త చట్టాలపై అవగాహణ రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాద్యం అవుతుందని డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లు నందిరామ్ నాయక్, దేవేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు గోపి, శివకుమార్, మల్లయ్య, సంజీవ్, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి తో పాటు ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.