• రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి
  •  సర్జరీ, పోస్ట్ ఆఫ్ కేర్ లో క్షమించరాని నిర్లక్ష్యం
  •  పేషెంట్ కృష్ణ ప్రాణాపాయస్థితికి చేరుకున్నా పట్టించుకోని డాక్టర్లు
  •  నిర్లక్ష్యంతో..గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చిన వైనం
  •  ఆరు నెలలు మంచానికే పరిమితమైన బాధితుడు
  •  తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఆస్పత్రి పై కృష్ణ ఫిర్యాదు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

అమ్మ జన్మనిస్తే.. ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దాని నుంచి కాపాడి.. పునర్జన్మనిచ్చే దేవుళ్లుగా వైద్యులను ఆరాధిస్తుంటారు. అలా గొప్పగా కీర్తించబడే పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందినవారే హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి వైద్యులు అని బాధితులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు జర్నలిస్టు కృష్ణ పేర్కొన్నారు.

ఈ ఏడాది 21 జూలైన అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జర్నలిస్ట్ కృష్ణకు.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సుమారు నాలుగు గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.  ఒకరోజు తర్వాత హాస్పిటల్ లో వైద్యం సరిగా లేకపోవడం గ్రహించిన కుటుంబ సభ్యులు.. వైద్యులను అడగగా.. ఎవరూ స్పందించకపోవడంతో.. ఆపరేషన్ వికటించిందని భావించి..జూలై 23 రాత్రి వరంగల్ మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే హైదరాబాద్ బేగంపేట మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు.

మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న రోగిని చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ ఎక్కువ స్థాయికి చేరుకుందని
అబ్జర్వేషన్ లో ఉంచి మరో ఆపరేషన్ చేశారు. దానికి పూర్తిగా అయిన ఖర్చు రూ.14 లక్షలు.. దానికి తోడు ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఐతే అంత పెద్దగా కావడానికి కారణం బంధన్ హాస్పటల్ లో జర్నలిస్టు కృష్ణకు 4 గంటల పాటు చేసిన వైద్యంలో
జరిగిన తప్పిదమే కారణం అని బాధితుడు కృష్ణ ఆరోపించారు.

అయితే బాధితుడు సర్జరీ చేసే సమయంలో రికార్డు అయిన వీడియో ఇవ్వమని పలుమార్లు అడిగిన కూడా బంధన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ దాటి వేయడంతో బాధితుడు తనపై చాలా ప్రయోగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమాజంలో జరిగే మంచి చెడును విశ్లేషించే పాత్రికేయుడి నైన తనకు సదరు ఆసుపత్రిలో అన్యాయం జరగగా, ఇక సామాన్యుడి సంగతి ఏమిటని జర్నలిస్ట్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు బంధన్ ఆసుపత్రి వెనక ఉన్న రాజకీయ అండదండలను చూసి బెదరకుండా ఆసుపత్రి పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.