వేద న్యూస్, వరంగల్ టౌన్:
ములుగు రోడ్ అరెపల్లిలోగల పాఖాల కొత్తగూడకు చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి..స్టోర్స్ లో నిర్వహణ అపరిశుభ్రంగా ఉండడంపై, మెనూ ప్రకారం భోజనం ఉండక పోవడంపై డిప్యూటీ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ లకు మెమోలు జారీ చేయాలని డిబిసిడిఓను ఆదేశించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సబ్జెక్టులలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నాయని అడిగారు. ఏమైనా సమస్యలుంటే కంప్లైంట్స్ బాక్స్ లో వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డిబిసిడిఓ పుష్పలత తదితరులు ఉన్నారు.