•  అంబేడ్కర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్‌లో భాగంగా ప్రదానం
  •  ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అందజేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్

వేద న్యూస్, ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రానికి చెందిన యువకుడికి బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు వచ్చింది. సేవా విభాగంలో సదరు యువకుడు అందించిన సేవలకు అవార్డుతో పాటు సర్టిఫికెట్‌ను సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు గురువారం హైదరాబాద్‌లో అందజేశారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు ఎల్కతుర్తికి చెందిన యువకుడు అంచనగిరి వెంకటరమణ మానవతా దృక్పథంతో చేసిన సేవలను గుర్తిస్తూ అవార్డును ప్రదానం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డుతో పాటు సర్టిఫికెట్‌ను అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం వెంకటరమణ చేసిన సేవలను అభినందించారు. భవిష్యత్తులోనూ సేవలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.