- ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
వేద న్యూస్, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 11న జరగనున్న ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో జరిగిన ప్రచార పాదయాత్రలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి పాల్గొన్న మల్క కొమరయ్య, ప్రతి గడపకు వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
“బీజేపీ ప్రచార కరపత్రాలను పంచుతూ ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్‌పై విశ్వాసం లేదు. బీఆర్ఎస్‌పై నమ్మకం పోయింది. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. కమలం గుర్తుకు ఓటు వేస్తేనే తెలంగాణలో మార్పు ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత వెనక్కు తగ్గింది అని మండిపడ్డారు.మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీలను గాలికి వదిలేసింది. రైతులు, మహిళలు, వృద్ధులు, యువత అందరూ కాంగ్రెస్ పాలనలో మోసపోతున్నారు. ఈ అన్యాయానికి బుద్ధి చెప్పేది ఓటే. నవంబర్ 11న మీ ఓటుతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి “అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నేతల మాటలు ఆకాశమంత పెద్దవి, కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు. ప్రజలకు సేవ చేస్తామని గెలిచినవారు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని తుంగలో తొక్కారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే నాణానికి రెండు వైపులుగా మారాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీ టీమ్‌గా పని చేస్తోంది అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఇంట్లోనే సర్దుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా సరిదిద్దగలరు. అల్లుడు ఒక దిక్కు, కూతురు ఒక దిక్కు, కొడుకు ఇంకో దిక్కు. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసింది. ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు అని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల చూపు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వైపే ఉందన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించడం ద్వారా తెలంగాణలో నిజమైన ప్రజాపాలనకు నాంది పలుకుదాం అని మల్క కొమరయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇన్‌చార్జ్ బంగారు శృతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.