• సమాజంలో శాంతి స్థాపనకు మీడియా పాత్ర కీలకం
  • రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే
  • బ్రహ్మకుమారీస్ నేషనల్ మీడియా కాన్ఫరెన్స్‌కు హాజరు 

 

సమాజంలో శాంతి స్థాపనకు, ఐక్యత, విశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ మీడియా వింగ్ నిర్వహణలో మౌంట్ అబులోని అబు రోడ్‌లో జరిగిన బ్రహ్మకుమారీస్ నేషనల్ మీడియా కాన్ఫరెన్స్‌-25కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి ప్రసంగించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో దేశ నలుమూలల నుంచి వచ్చిన 1,500 మందికి పైగా జర్నలిస్టులు, పత్రికల సంపాదకులు, ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ మీడియా వారు పాల్గొన్నారు. 

 

 

హరిభావు బాగడే మాట్లాడుతూ..మీడియా ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమని చెప్పారు. ప్రజాస్వామ్యం భారతీయుల రక్తంలో ఉందని వెల్లడించారు. కులంపైన కాకుండా జాతీయ దృక్పథం, ఆలోచనల ప్రాతిపదికపైన ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై మీడియా దృష్టి సారించాలన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణపై స్పృహ, అవగాహన కల్పించడంలో బ్రహ్మకుమారీస్ కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

అంకితభావం, క్రమిశిక్షణతో భారతీయ సంస్కృతి పరిరక్షణకు, గ్రామాలు, సమాజ అభివృద్ధికి బ్రహ్మకుమారీస్ పని చేస్తున్నారని వెల్లడించారు. శాంతి భారతీయుల సహజధర్మమని స్పష్టం చేశారు.  

బ్రహ్మకుమారీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బీకే మోహిని మాట్లాడుతూ..శాంతి మన సహజ ధర్మమని చెప్పారు. జ్ఞానవ్యాప్తిలో, సమాజం సామరస్యం, ఆనందరం వెల్లివిరిసేలా చేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని వెల్లడించారు. 

 

భోపాల్ మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనవర్సిటీ ఆఫ్ జర్నలిజం హెడ్ ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది మాట్లాడుతూ..మీడియాను దేశ కండ్లుగా అభివర్ణించారు. జర్నలిస్టులుగా ప్రతిరోజూ మీరు భారతీయ చరిత్రను రాస్తున్నారని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తమ ప్లాట్‌ఫాం వేదికగా రాస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఫేక్ న్యూస్, నెగెటివిటీ ట్రోలింగ్‌‌కు తావు లేకుండా కంటెంట్ ఉండాలని సూచించారు. 

బ్రహ్మకుమారీస్ మీడియా వింగ్ చైర్‌పర్సన్ బీకే కరుణాబాయి మాట్లాడుతూ..ఈ కాన్ఫరెన్స్ పబ్లిసిటీ కోసం నిర్వహించింది కాదని, ప్రతి ఒక్కరిలో సంతోషం, శాంతి పెంపొందేలా, ఆ అనుభూతి కలిగేందుకు ఉద్దేశించి నిర్వహించినదని వెల్లడించారు. ‘శాంతి, ఐక్యత, నమ్మకం’ మానవ సమాజంలో పెంపొందేలా చేయడమే కాన్ఫరెన్స్ థీమ్ అని మీడియా వింగ్ వైస్ చైర్ పర్సన్ బీకే సరళ చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌కు బ్రహ్మకుమారీస్ జైపూర్ జోనల్ కోఆర్డినేటర్ చంద్రకళ అధ్యక్షత వహించారు.