• బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు

వేద న్యూస్, మంచిర్యాల :

బీసీ లకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీని ఒడించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని సాయిరాం నగర్ లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి 210 అంశాలతో కూడినటువంటి బీసీ పాలసీ రూపొందించి అమలు చేస్తామని ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఏడు సంవత్సరాల కాలం అవుతున్న ఏ ఒక్క బీసీ పాలసీని అమలు చేసినటువంటి సందర్భం లేదని అన్నారు.

అలాగే 2017 మార్చి బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి చట్టం చేస్తామని చెప్పిన కేసీఆర్ బీసీ సబ్ ప్లాన్ పై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టినటువంటి సందర్భం లేదని తెలిపారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 34 శాతంగా ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండోసారి 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 10 శాతం తొలగించి 24 శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు.

నామినేటెడ్ పదవుల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి బీసీ లను విస్మరించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 77 వేల మంది గత నాలుగు సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వీటికి సంబంధించి ఇప్పటివరకు ఏ నిరుద్యోగ బీసీ యువతకు కార్పొరేషన్ రుణాలు విడుదల చేసిన పాపాన పోలేదని, బీఆర్ఎస్ బీసీలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించిన పాపాన పోలేదని అన్నారు.

ఈ విషయాన్ని బీసీ సమాజం గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు వంగాల దయానంద్, జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, గజ్జెల్లీ వెంకన్న, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు బొడెంకి మహేష్, శ్రీపతి రాములు, రాసమల్ల కుమార్, బోరే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.