వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి, వరంగల్‌లోని చౌరస్తా కూడలిలో ఉన్న భారీ హోర్డింగ్‌ను ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించగా, అక్కడికి హుటాహుటిన చేరుకున్న వరంగల్ ట్రాఫిక్ సీఐ కె.సుజాత చాకచక్యంగా వ్యవహరించి అతడి ప్రాణాలు కాపాడారు. సమాచారం తెలుసుకున్న సీఐ సుజాత వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హోర్డింగ్‌పై ఉన్న వ్యక్తితో దాదాపు గంటపాటు మాట్లాడి, నచ్చజెప్పి కిందికి దింపారు.

 

సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు నిలబెట్టడంతో స్థానికులు, ప్రజలు సీఐ సుజాతను అభినందించారు. పోలీసులు విచారించగా ఆ వ్యక్తి తన స్వస్థలం వాంఛనిగిరి అని, ప్రస్తుతం లేబర్ కాలనీలో నివసిస్తున్నట్లు చెప్పాడు. ఇంట్లో జరిగిన గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై మద్యం సేవించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు.

అక్కడ గుమిగూడిన ప్రజలు ఏం జరుగుతుందో చూస్తూ నిలబడ్డారే తప్ప అతడిని కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదని సీఐ సుజాత తెలిపారు. ఆటో డ్రైవర్లు, తన సిబ్బంది సహాయంతో అతడిని సురక్షితంగా కిందకు దించామని ఆమె చెప్పారు. అనంతరం ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సమాచారం అందించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు సీఐ పేర్కొన్నారు.