జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ*
*రోడ్డు భద్రత ప్రమాణాల పై విస్తృత ప్రచారం కల్పించాలి
*రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు.
సిరిసిల్ల, వేములవాడ ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రోడ్ల వద్ద ఉన్న ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లకు గుర్తించి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్ లను మూసి వేయాలని, రోడ్డుపై అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్ చేసేందుకు స్పీడ్ గన్స్ కొనుగోలు చేయాలని అన్నారు. సిరిసిల్లలోని వెంకటాపూర్ జంక్షన్, వేములవాడ నాంపల్లి × రోడ్ , అనుపురం ముస్తాబాద్, తంగళ్ళపల్లి, పెద్దూరు రగుడు జంక్షన్ ల వద్ద అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.జిల్లాలో రోడ్డుకు సమీపంలో ఉన్న పాత బావుల పూడ్చివేత , రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ఇతర రోడ్ల లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ సమీపంలో గల ఆయుష్మాన్ భారత్ అమలు చేసే ఆసుపత్రులకు మ్యాపింగ్ చేయాలని అన్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ 112 కు ఫోన్ చేయాలి అనే అంశం ప్రస్తుత ప్రచారం చేయాలని కలెక్టర్ తెలిపారు.రోడ్ల వెంబడి ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో రేడియం సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు మరమ్మత్తు ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని సూచించారు.జిల్లాలో ఉన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో రోడ్డు పై ఉన్న అనవసర బ్యానర్లు, ఫ్లెక్సీలు తోలగించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లాలో టి జంక్షన్ రోడ్ల వద్ద అవసరమైన స్పీడ్ బ్రేకర్, రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని,సరుకు రవాణా వాహనాలు, ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, జిల్లాలోని ప్రతి విద్యాసంస్థలో రోడ్డు భద్రత ప్రమాణాల పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆర్టీఏ నాన్ అఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్, ఈఈ ఆర్ అండ్ బీ,వెంకట రమణయ్య, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ , డీఈవో వినోద్ డిపిఓ షరీఫుద్దీన్ డిఎంహెచ్వో రజిత మున్సిపల్ కమిషనర్లు, పోలీసు ఎక్సైజ్ అధికారులు సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.