వేద న్యూస్,బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు మొదలైనట్లు తెలుస్తుంది. నిన్న, మొన్నటి వరకు అధికార పార్టీలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించిన ఒక్కసారిగా నేతల మధ్య సెగలు భగ్గుమని రాచుకున్నాయి. చివరికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధి తన పర్యటన సందర్భంగా వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తనే పోలీస్ స్టేషన్ కు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే.. చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పలు అభివృద్ధి పనుల నిమిత్తం ఈ రోజు బోయినిపల్లి మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే పర్యటన సందర్బంగా నీలోజిపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి తరలించడం స్థానికంగా పార్టీ నేత లలో ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. అయితే ఇటీవల మండల ఎస్సె సెలవు పై వెళ్లిన విషయంలో ఎమ్మెల్యే సత్యంకు, రవీందర్ కు మధ్య విభేదాలు తలెత్తడం, ఈ విషయంలో ఎమ్మెల్యే సత్యంను కూస రవీందర్ ప్రశ్నించడమే ఈ వివాదానికి దారితీసిందని అందుకే సత్యం పర్యటనల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కూస రవీందర్ ను ముందస్తు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. రవీందర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అన్న విషయం పై సందిగ్ధత నెలకొంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.