= దళిత బంధు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్
వేద న్యూస్, జమ్మికుంట:
దళిత బంధు రెండో విడత నిధులు జమ్మికుంట మండల పరిధిలోని లబ్ధిదారులకు అందనందున, మండలంలోని దళితబంధు రాని బాధితులు, దళితులు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని దళిత బంధు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్
కోరారు. సోమవారం ఆయన స్థానిక జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో పోరాట సమితి సభ్యులు జమ్మికుంట మండలంలోని ఊరురా దళితవాడలో తిరిగి ఈ మేరకు ప్రచారం చేస్తామని చెప్పారు.
దళిత బంధు యూనిట్లు నష్టపోయి ఉన్న తమ దళిత కుటుంబాల మీద విచక్షణరహితమైన వెరిఫికేషన్ అనే గుదిబండ ఎందుకు? అని ప్రశ్నించారు.
రెండో విడత దళిత బంధు నిధులను హవాలా నిధులని, పుణ్యానికి వచ్చిన పైసలు అని కుసంస్కారంతోని కులహంకారంతోని మాట్లాడే కొందరికి ఒకటే చెబుతున్నాం ..వేల సంవత్సరాల తరబడి వెలివేయబడ్డ జాతులం, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి 100 శాతం సబ్సిడీ స్కీమ్ రావడం ఈ హుజురాబాద్ నియోజకవర్గం దళితుల అదృష్టం అని చెప్పారు. ఈ డబ్బులు మీ ఇంట్లో నుంచి మీ బీరువాలో నుంచి డబ్బు తీసి ఈ నిధుల రూపకంగా మాకు ఇవ్వట్లేదని, ఇకపైన ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే తగు రీతిలో సమాధానం చెప్తామని హెచ్చరించారు. ‘దళిత బంధు’ వచ్చిందనే సాకుతో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ వికాసం లాంటి స్కీములు దళితులకు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదని, దానని తీవ్రంగా ఖండిస్తున్నామని, పునరాలోచన చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ స్కీములు ఇవ్వాలని మనవి చేశారు.