- తెరపైకి పలువురి పేర్లు..అధిష్టానం పరిశీలన
- పార్టీ బలోపేతంతో పాటు స్థానాల గెలుపుపై జిల్లా మంత్రుల దృష్టి
- ఆశావహుల్లో జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, ప్రణవ్, రోహిత్ రావు!
- పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ, నల్లాల ఓదెలు!
వేద న్యూస్, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని బరిలో దించాలనే విషయమై హస్తం అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నాయకుల అభ్యర్థిత్వాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బలమైన అభ్యర్థులను బరిలో దింపి ఈ సారి అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న హస్తం పార్టీ..ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం పాలన విషయాలతో పాటు తమ సొంత జిల్లాలోని పార్లమెంటు స్థానాలపైన దృష్టి సారిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేయాలనే విషయమై అధిష్టానం అభ్యర్థులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ ఈ సారి మాత్రం గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమాయత్తమవుతున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం విషయానికొస్తే..ఈ స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన క్యాడర్ ను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేలా సూచనలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తల కష్టంతోనే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలుపు వారి వల్లే సాధ్యమవుతుందని భావనతో ముందుకెళ్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పోటీ చేస్తారనే వార్తలు ఇటీవల వచ్చాయి. కాగా, తనకు అలాంటి ఆలోచన లేదని శ్రీనుబాబు ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ..బలమైన ఛరిష్మా ఉన్న లీడర్ ను పోటీలో దించాలని భావిస్తోంది. తద్వారా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని నిలుపుకోవచ్చనే అభిప్రాయంతో ముందుకు సాగుతోంది.
ఈ టికెట్ రేసులో ప్రముఖంగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావు పేర్లు వినబడుతున్నాయి. వీరితో పాటు హుజురాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వొడితల ప్రణవ్, ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కానీ, సీనియర్ రాజకీయ నాయకుడైన ఆయన్ను(ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి) బరిలో దింపడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీలను ఈజీగా నిలువరించవచ్చనే అభిప్రాయాలూ అక్కడక్కడ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికొస్తే..ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం అయిన ఈ సీటు నుంచి బలమైన అభ్యర్థిని దింపాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. గతంలో ఇక్కడ్నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వివేక్ వెంకటస్వామి..ప్రస్తుతం చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎవరిని టికెట్ వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎస్సీ సామాజిక వర్గా నాయకులు అందరూ దాదాపుగా ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ అధిస్టానాన్ని ఆశ్రయిస్తున్నారు.
మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ తో పాటు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. చూడాలి మరి..చివరికి అధిష్టానం ఈ రెండు స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా నిలుపుతుందో..అయితే, ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టి సారిస్తున్నారు.