• ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్

వేద న్యూస్, జమ్మికుంట:
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం జమ్మికుంట మండలంలోనీ మాచనపల్లి, అబాది జమ్మికుంట, జగ్గయ్య పల్లి, పెద్దంపల్లి, కేశవపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామని హామీనిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేదని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అది నమ్మొద్దని సూచించారు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. రూ.1,000 కోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అభివృద్ధి చేయడానికి ఎవరు ఆపారని అడిగారు.

మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని ఆయన గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని విమర్శించారు.

ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక, నాయకులు శివ, సుంకరి రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, అన్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.