- హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్
- అధికారులతో కలిసి లాంఛనంగా ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం
- కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో కలిసి ఘనంగా వేడుకలు
వేద న్యూస్, హుజూరాబాద్:
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో శనివారం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వీట్లు పంపిణీ చేస్తూ సంబురాలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు మరిన్ని వరాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం లాంఛనంగా ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. హుజూరాబాద్ బస్టాండ్ లో ఆర్టీసీ డీపో మేనేజర్ అర్పిత, ఎక్సైజ్ సిఐ దుర్గాభవానీలతో కలిసి ‘మహాలక్ష్మి’ పథకాన్ని వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి ప్రణవ్ అధికారులతో కలిసి పచ్చజెండా ఊపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లూరి కిరణ్, రాజేశ్వర్ రావు, శ్యాంసుందర్ రెడ్డి, చరణ్ పటేల్, మహిళా అధ్యక్షురాళ్లు యేముల పుష్పలత, పూదరి రేణుక, రజిత, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, నాయకులు సాహెబ్ హుస్సేన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అస్సర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.