- రోడ్డును తవ్వారు.. వేయడం మరిచారు..
- రోడ్డు తవ్విన చోట డ్రైనేజీ చేరిక.. పొంచిన సీజనల్ డిసీజెస్ ముప్పు
- ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం.. పట్టించుకునే వారేరి?
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిన రోడ్డు నిర్మాణం పనులు
వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వంతడుపుల బై పాస్ రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఒకవైపు సీసీ నిర్మాణం దాదాపు పూర్తి చేశారు. మరోవైపు సీసీ రోడ్డు నిర్మాణం కోసం రోడ్డును తవ్వి 20 రోజులు గడిచినా సదరు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదే క్రమంలో సదరు కాంట్రాక్టర్ అక్కడ ఉన్న వైన్స్ ముందు రోడ్డును తవ్వకుండా వైన్స్ యజమానులకు అనుకూలంగా ఉండటంలో మతలబు ఏమిటో? అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ ఏరియాలో ఉన్న వ్యాపారస్తులకు, ప్రజలకు, వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతున్నదని, ఎంత చెప్పినా వినకుండా..‘ ఇదిగో చేస్తాం,అదిగో చేస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారు.
రోడ్డును తవ్విన గుంతల్లో డ్రైనేజీ నీళ్లు నిలిచి దుర్వాసన వచ్చి, దోమలు వృద్ధి చెందుతున్నా కూడా సదరు కాంట్రాక్టర్ కాని, అధికారులు కాని స్పందించటం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు,వ్యాపారస్తులు కోరుతున్నారు.