- తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని, మైనర్లు నడిపిన వాహనాలు పట్టివేత
- నూతన చట్టాలపై అవగాహన కల్పించిన హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ
- నంబర్ ప్లేటుపై ఎలాంటి రాతలు ఉండకూడదని సూచన
- చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టి నంబర్ ప్లేట్ లేని..అలాగే మైనర్లు నడిపిన వాహనాలతో పాటు ట్రిపుల్ రైడ్ చేసిన వాహనదారులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 53 ద్విచక్ర వాహనాలను తనిఖీల్లో పట్టుకొని స్టేషన్ కు తరలించగా హుజురాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి..వాహనదారులకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వాహనదారుల తో మాట్లాడుతూ ప్రతి వాహనానికి తప్పకుండా నంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలని, నంబర్ ప్లేట్ల పైన అనవసరమైన రాతలు రాయకూడదని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేయబడతాయని..అంతేగాకుండా భారీగా జరిమానా విధించాల్సి వస్తుందని తెలిపారు. ఒక్కొక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని, ఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన పేపర్లు లేకుండా..నంబరు ప్లేట్లు లేకుండా ట్రిపుల్ రైడ్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.
వాహనదారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ఏ విషయంలోనైనా పోలీసులు మీకు సహకరిస్తారని, పోలీసులకు మీరు కూడా సహకరించాలని చట్టబద్ధంగా ఏ పనైనా పోలీసులు చేస్తారని చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వరగంటి రవి, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.