వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఓ మోసగాడు ముద్ర లోన్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఐదు లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికి, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో పలు విడతలుగా మొత్తం రూ.1,25,000 దోచుకున్నాడు. ఇదో రకం నయా చీటింగ్ అని, ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఈ మోసంపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆన్లైన్లో నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై కె. రాహుల్ రెడ్డి తెలిపారు.
సైబర్ నేరాలకు గురైనవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని, లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. “ఎటువంటి డబ్బులు ముందస్తుగా పంపకండి, అనుమానాస్పద కాల్స్‌కి జాగ్రత్తగా స్పందించండి” అని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.