వేద న్యూస్, శాయంపేట:

హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .ఏ అప్పయ్య శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పత్తిపాక, ప్రగతి సింగారం గ్రామాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళ శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో అంగన్ వాడీ కేంద్రాలలోని పిల్లలకు ఐరన్ సిరప్ , యాంటీబయాటిక్ సిరప్ లు కొన్నిచోట్ల ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్  దృష్టికి తీసుకురాగా , శాయంపేటలో అందుబాటులో ఉన్నాయా? లేదా ? అని పరిశీలించారు.

అనంతరం అందరు ఫార్మసిస్టులతో మాట్లాడి ఒక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ఇంకొక దగ్గర లేనట్లయితే తాత్కాలికంగా వారు సర్దుబాటు చేసుకోవాలని , మందుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.

శాయంపేట పీహెచ్ సి లోనలుగురికి కుక్క కాటు వ్యాక్సిన్ ఇచ్చారు. అన్ని రికార్డులు ,రిజిస్టర్లు సరిగా నిర్వహించాలని పై అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయో గమనించి వైద్య శిబిరములు ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీ సిబ్బందితో సమన్వయపరచుకోవాలన్నారు.

అనంతరం వైద్యాధికారితో కలిసి పత్తిపాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు . పదకొండు మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా ఇద్దరూ మాత్రమే వచ్చారని ఏఎన్ఎంలు తెలియచేశారు. అలాగే ప్రగతి సింగారంలో ఇద్దరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పండుగ కారణంగా ఎవరు రాలేదని సంబంధిత సిబ్బంది తెలిపారు.

టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఎంతమందిని పరీక్షించారు ,ఎంతమందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు తదితర విషయాలను తెలుసుకొని టీబీ సోకే అవకాశం ఉన్న ఎనిమిది గ్రూపుల వారిని ఇంకా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రతిరోజు ఇరవయి ఐదు ఇళ్లను సందర్శించడంతోపాటు డ్రైడేపట్ల అవగాహన కలిగించాలన్నారు. టెస్టింగ్ కిట్ లు,మందులు అందుబాటులో ఉన్నాయా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ ,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.