• ఈ సూత్రాలు పాటిస్తే మీకు ఆరోగ్యం
  •  ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట:
ఆయుర్వేద వైద్య శాస్త్ర పితామహుడు చరకుడు రచించిన చరక సంహితలో చెప్పిన ఆరోగ్య రహస్యంను ప్రతీ ఒక్కరూ పాటిస్తే ఆరోగ్యవంతులుగా అందరూ ఉంటారని ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘చరక సంహిత’లో పేర్కొన్న దాని ప్రకారం.. మిత భుక్తి, హిత భుక్తి, ఋత భుక్తి కలిగి..,శారీరక శ్రమ చేసే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని వెల్లడించారు.

మిత భుక్తి అనగా అతిగా తినక పోవడం. అతిగా తినడం వల్ల ఒబెసిటీ(ఊబకాయం) వచ్చే ప్రమాదముంది. హిత భుక్తి అనగా శరీరానికి మేలు చేసే ఆహారం మాత్రమే తీసుకోవడం. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రమే కలిగి ఉండటం. ఋత భుక్తి అనగా అనగా శ్రేష్టమైన ఆహారం. హైజినిక్ ఫుడ్‌ను కంపల్సరీగా తీసుకోవడం. ఇకపోతే ముఖ్యమైనది కష్టార్జితమైన, న్యాయార్జిత మైన ఆహారం తీసుకోవడం అతి ముఖ్యమని చెప్పారు.

జీవితంలో నిజాయితీగా ఉండే వారిలో మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయి. తద్వారా శారీరక జబ్బులు(సైకో సోమాటిక్ డిసీజెస్) రాకుండా ఉంటాయని డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

నైతిక జీవనం ముఖ్యం
ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో వేయి అబద్ధాలు చెప్పవలసి వస్తుందని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చిట్టిరెడ్డి వెల్లడించారు. అదే సందర్భంలోనూ నిజం ఎప్పుడు బయటపడుతుందోననే భయం తరచూ వెంటాడుతుంటుంది.. ఫలితంగా అది అధిక మానసిక ఒత్తిడికి గురి చేసి మానసికంగా తద్వారా శారీరక జబ్బలుకు దారి తీస్తుందని డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

అలా జనం యాంగ్జైటీ, హై బీపీ, డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ వంటి డిసీజెస్‌ను తెచ్చుకుంటారని చెప్పారు. నేరమయ జీవితాలలో ఇవి అధికం ..అందుకే నిజాయితీ జీవితంతో మనశ్శాంతి పొంది ఆరోగ్యాన్ని పెంచుకోవాలని డాక్టర్ సూచించారు.

ఇక ప్రతీ రోజూ 45 నిమిషాలపాటు శారీరక శ్రమ చేయడం ద్వారా లైఫ్ స్టయిల్ డిసీజెస్ మీ దరి చేరవు. మీరు ఆరోగ్యవంతులుగా ముందుకు సాగుతారు. పిల్లలకు చిన్ననాటి నుంచే నైతిక జీవనం అలవాటు చేయాలని, తిను, తాగు, ఎంజాయ్ చేయి వంటి కల్చర్‌కు దూరంగా ఉంచడం మంచిదన్నారు.