వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జరిగిన విషాదకర ఘటన ఒక బాలిక ప్రాణాలను బలిగొంది. తేలు కుట్టిన ఘటనపై సరైన వైద్యం అందించకపోవడంతో కదురుక మహాల అనే 9 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఘటనలో సంబంధిత ఆర్ఎంపీ వైద్యుడు జంగుల సంజీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే క్రిష్టంపేట గ్రామానికి చెందిన కదురుక మహాల (9), తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా ఉన్న పత్తి చేనుకు పని నిమిత్తం వెళ్లింది. ఈ క్రమంలో చెట్టు కింద కూర్చున్న సమయంలో తేలు రెండు కాళ్లపై కుట్టింది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ సంజీప్‌ను సంప్రదించగా, అతను ఇంజెక్షన్ వేసి అన్ని బాగుంటుందని భరోసా ఇచ్చాడు.అయితే, బాలిక ఆరోగ్యం మరుసటి రోజు మరింత విషమించడంతో వెంటనే వేములవాడలోని మధు పిల్లల హాస్పిటల్ మరియు ఆనంద రెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పేర్కొనడంతో, మరింత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతుండగానే జూన్ 28, 2025న బాలిక తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి కదురుక సరిత (వైఫ్ ఆఫ్ రమేష్) ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ జంగుల సంజీప్ (ఎస్/ఓ చిన్న గంగారం, మెట్పల్లి, ప్రస్తుతం జోగాపూర్ నివాసి)పై వైద్య నిర్లక్ష్యం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తేలికపాటి విషపూరిత జీవుల కాటు సమయంలో కూడా సరైన వైద్యం అందకపోతే ఏ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుందో తెలుస్తుంది.