వేద న్యూస్, శాయంపేట:
ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో శాయంపేట మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు భాగస్వాములు కావాలని శాయంపేట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని శాయంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 26 నుంచి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సర్వే లో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరు లేని పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. ఈనెల 21 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. గ్రామ సభలలో సైతం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని . దీనిపై అర్హులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగుభూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇవ్వడం, భూమి లేకుండా ఉపాధి హామీ పనిచేసుకునే నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడం, గత పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం లాంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాయంపేట కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి ,మారేపల్లి రవీందర్, శానం కుమారస్వామి, వైనాల కుమారస్వామి ,దుబాసి కృష్ణమూర్తి , నిమ్మల రమేష్ ,కొమ్ముల భాస్కర్ ,డిటి రెడ్డి ,గోపాల్ రెడ్డి బూర పైడి ,జగన్ ,బిక్షపతి ,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.