వేద న్యూస్, వరంగల్:
‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/
ఎవడికి వాడు నాదే హక్కని .. చెయ్యేస్తే.. ఎట్టా? /
తరముల నాటి కథంతా../ మన తదుపరి మిగలాలంట
/ కదపక చెరపక.. పదికాలాలిది కాపాడాలంటా../
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం/
ఇష్టంగా గుండెకు హత్తకుందాం../ కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం../
తల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కడు మిగలం..’’ అంటూ సాగే ఓ సినీ పాటలో ప్రకృతికి కోపమొస్తే.. భూమ్మీద ఏ ఒక్కరు మిగలబోమని, అందుకే పర్యావరణానికి చేటు చేయొద్దని సూచిస్తూనే.. పరిరక్షణకు పాటు పడాలనే సందేశాన్ని గేయ రచయిత సాంగ్‌లో అందించే ప్రయత్నం చేశారు.
కాగా, ఈ పాటలోని పంక్తులను నరనరాన వంటపట్టించుకున్నట్టుగా మన తదుపరి తరం, మనుషులకు ప్రకృతి మిగల్చడం కోసం.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి.. ‘హరిత’ యజ్ఞం చేస్తూ… జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు విశేషంగా పాటు పడుతున్న వ్యక్తి పిట్టల రవిబాబు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వన్యప్రాణులతో పాటు పర్యావరణ పరిరక్షణలో ‘నేను సైతం’ ఓ సమిధనై ముందుకు సాగుతానని, తన వంతు ప్రయత్నం, కృషి చేస్తున్న పర్యావరణవేత్త పిట్టల రవిబాబుపై ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..
పర్యావరణ హితమే ‘పిట్టల’ అభిమతం
అశేష జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు భూమ్మీద ఉన్న ప్రకృతి అందిస్తోంది. కాగా, సకల జీవరాశిలో మానవుడి వాటా అతి స్వల్పం. కానీ, పర్యావరణానికి మనిషి చేసే హాని మాత్రం అత్యంత అధికం. భూమ్మీద జరుగుతున్న విధ్వంసం ఆపకపోతే వినాశనం అతి దగ్గర్లో ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణ విద్యపైన అవగాహన కల్పించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన వారిలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి పర్యావరణవేత్త పిట్టల రవిబాబు.

ప్రకృతితో మమేకమవుతూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ…
నిద్ర లేచింది మొదలు.. పర్యావరణ పరిరక్షణపై అవగాహనకు ఆ రోజు ఏయే కార్యక్రమాల్లో పాల్గొనాలనే విషయాలపై కార్యాచరణ రూపొందించుకుని.. ఎంత దూరమైనా ప్రయాణం చేసి.. ప్రకృతితో మమేకమవుతూ.. నేచర్ నెసిసిటీని వివరిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం ప్రతి రోజూ చేయడం పిట్టల రవిబాబు దినచర్య. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్(అధికరణ 51 ఏ(జీ)) ప్రకారం.. ‘‘ప్రకృతి పరిసరాలైన అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులు, ఇతర జీవులను సంరక్షించుకోవాలి’’, ‘‘ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి.. జ్ఞానాభివృద్ధికి పాటు పడాలి’’.. ఇవీ ప్రతి పౌరుడి ప్రాథమిక విధులు.. కాగా, ఈ డ్యూటీస్‌ను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తున్న పర్సన్ పర్యావరణవేత్త పిట్టల రవిబాబు.
ఉన్నత విద్యావంతుడు పిట్టల రవిబాబు..
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేసిన రవిబాబు పిట్టల..వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీలో జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఎంటెక్ చేశారు. అదే కాలేజీలో ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీపై పీహెచ్డీ చేస్తున్నారు. సెంటర్ ఫర్ వాటర్ రొసోర్సెస్, ఐఎస్టీ, జేఎన్టీయూహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రవిబాబు వర్క్ చేశారు.
జూనియర్, సీనియర్ రీసెర్చ్ స్కాలర్‌గా వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో వివిధ వర్సిటీల్లో పని చేశారు. సుమారు 20కు పైగా రీసెర్చ్ పేపర్స్‌ను వివిధ ప్లాట్‌ఫాంలలో జర్నల్స్‌లో, మౌఖికంగా రవిబాబు ప్రజెంట్ చేశారు. వివిధ అంశాలపై 500 కు పైగా ఆర్టికల్స్ రాశారు. సహజ వనరుల క్షీణత, సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతుగా రవిబాబు పిట్టల విశేషంగా కృషి చేస్తున్నారు.

ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌పై వివిధ కాలేజీలు, స్కూల్స్, పబ్లిక్కు అవగాహన కల్పించేందుకు పిట్టల రవిబాబు..ఆయా సంస్థలతో పాటు తెలంగాణ అటవీశాఖ, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు, ఇతర ఎన్జీవోలతో భాగస్వామి అవుతారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(Orugallu Wildlife Society) ఎన్జీవోకు జాయింట్ సెక్రెటరీ రవిబాబు పని చేస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని.. పర్యావరణ పరిరక్షణకు రవిబాబు తన గళం వినిపించారు.
