ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే. పంచభూతాలుగా నేచర్‌ను ఆరాధిస్తుంటాం. కానీ,
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రకృతి సూత్రం, సిద్ధాంతం తెలియక అభివృద్ధి ముసుగులో
స్వార్థపూరిత ఆలోచనలతో విలాస జీవనం కోసం అవసరాలకు మించి సహజ వనరుల సంపదను
ఒకేసారి డబ్బు రూపంలోకి మార్చాలని మట్టిని, ఇసుకను, నీటిని, మొరాన్ని,
కొండలను, గాలిని, సముద్ర సంపదను, లోహాలు, ఖనిజ సంపదను కొల్లగొడుతూ
కోట్లకు పడగలెత్తుతున్నారు.

ధనవంతులుగా మారాలనే ఆలోచనతో ప్రకృతికి హాని
చేకూరుస్తున్నారు.  వారి చర్యలతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని అతి త్వరలో
మానవులతో పాలు జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లనుందని మరిచిపోతున్నారు.
సమతుల్యత పాటించకపోతే ప్రకృతి అనేక విపత్తు (ప్రకృతి వైపరీత్యాలు),
తాత్కాలిక, దీర్ఘ కాలిక విఘాతాల రూపాలలో తన అసహనాన్ని అప్పుడప్పుడు,
అక్కడక్కడా (ప్రపంచవ్యాప్తంగా) మానవునికి చూపిస్తూనే ఉన్నది. అయినా మనిషి
తీరు మారడం లేదు.

తానే తెలివైనవాడినని, ఈ సమస్త సృష్టి, శతకోటి జీవరాసులకంటే తమకే తెలివి
ఉందని తమపై అధికారాన్ని ప్రదర్శిస్తూ, ప్రకృతి ధర్మానికి ఎదురెళుతూ..
రోజురోజుకూ ఉపేక్షించలేని స్థాయిలో ప్రకృతిపై తమ అధికారాన్ని,
అధిపత్యాన్ని, దౌర్జన్యాన్ని, దాష్టీకతను చెలాయిస్తున్నాడు.
అహంకారపూరితమైన, స్వార్థపు ఎత్తుగడలను ప్రదర్శిస్తూ, పర్యావరణ సమతూల్యతను
ఛిన్నాభిన్నం చేస్తూ ఒక మానసిక రుగ్మతలో పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ
నేపథ్యంలో ‘‘నీమార్గాన్ని మార్చుకో – లేదంటే నీకు మనుగడలేదు. నీతోపాటు
సమస్థజీవకోటి నాశనమైతుంది’’ అని ప్రకృతి మనిషికి తెలియజేస్తున్నది.

అయినా మనిషి మారడం లేదు. మానవుడిస్వార్థపూరిత తత్వం వల్ల జీవుల మనుగడకు ముప్పు
వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకుని మనలో
కొందరైనా ముందుకొచ్చి.. ప్రకృతిని, పర్యావరణాన్ని, సహజవనరులను,
పంచభూతాలను, సకల చరాచర జీవారసుల మనుగడను, వాటి ప్రాముఖ్యతను వివరించే
ఆలోచన మార్పు దిశగా ఇకనైనా మేల్కొని ముందుకెలుతేనే ప్రకృతిలో జీవ మనుగడకు
సాధ్యం. లేదంటే ప్రకృతి తనను తాను సమతుల్యం చేసుకుంటుంది.

ఈ తరుణంలోనే జీవకోటి మనుగడకు ముగింపు పలికి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకొని మళ్లీ
తిరిగి తన ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతి ముందుకెళ్తుంది. ఈ ప్రక్షాళనకు
ఎన్నేళ్లైనా పట్టొచ్చు కానీ, మార్పులో మాత్రమే మార్పుండదు. అందులో
మనముండము. అందుకే మనము మారాలి. మనచుట్టూ ఉన్న మనుషులను ప్రకృతి
ధర్మానికి, రక్షణకు అనుకూలంగా మారే విధంగా అవగాహన కల్పించాలి. ప్రకృతి,
పర్యావరణ, సహజ వనరులను ఎలా కాపాడగలమో వివరించాలి. భారత రాజ్యాంగంలోని
ఆర్టికల్ 51 ఏ/జీ..ప్రకారం ప్రతీ భారతదేశ పౌరుని ప్రాథమిక విధిగా
తెలుపుతూ బోధించాలి.

రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త,
సెల్:98494 25271.