- సమ్మక్క సారలమ్మ దీవనెలతో..
వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కన్నూర్, కమలాపూర్, మాదన్నపేట, మర్రిపల్లిగూడెం గ్రామాలలో సమ్మక్క సారలమ్మ దేవతలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే వనదేవతల పండగ అయిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా జాతర కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేయడం జరిగిందన్నారు.

సమ్మక్క సారలమ్మ తల్లుల అనుగ్రహం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగానే ముందుకు వెళుతుందని, ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. మన దేవతల అనుగ్రహం వల్ల ప్రతి ఒక్క కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమలాపూర్ మండల అధ్యక్షులు చరణ్ పటేల్, తవుటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, విజయ తదితరులు పాల్గొన్నారు.