అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలి
వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించడం చాలా కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలి ,నకిలీ ఓట్లు లేని ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని రోల్ అబ్జర్వర్ సి.సుదర్శన్ రెడ్డి అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఓటరు జాబితాపై నిర్వహించిన సమావేశంలో రోల్ అబ్జర్వర్ సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు. రోల్ అబ్జర్వర్ సి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా చాలా కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అవకాశం కల్పించాలని తెలిపారు.
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం రూపొందిస్తున్న ఓటరు జాబితాలో అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటరుగా నమోదు చేయాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా అధికంగా ఓటర్ నమోదు చేసిన పోలింగ్ కేంద్రాలను, అధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అక్కడ ఓటరు జాబితాలో జరిగిన మార్పులపై మరోసారి సమీక్షించాలని రోల్ అబ్జర్వర్ అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఓట్ల వివరాలు ఓటర్ల జాబితాలో నమోదై ఉన్నాయా, లేవో మరోసారి పరిశీలించాలని తెలిపారు
ఓటర్లకు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ 15 నాటికి ఓటర్ జాబితాలో నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డు ముద్రించి అందించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,
పెద్దపల్లి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 2023 నాటికి జిల్లా జనాభా 9 లక్షల 44 వేల 479 అవుతుందని అంచనాతో ఓటరు జాబితా రూపకల్పన కార్యక్రమం చేపట్టామని అన్నారు.జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల 99 వేల 580 మంది ఓటర్ల నమోదు జరిగిందని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించి తుది ఓటరు జాబితా విడుదల చేసే సమయానికి జిల్లాలో ఓటర్ల సంఖ్య 7 లక్షలు దాటుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 474 లోకేషన్స్ లో 837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్నారు .ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు జాబితా రూపకల్పన పర్యవేక్షణకు బూత్ స్థాయి అధికారులను ఏర్పాటు చేశామని, 837 మంది బూత్ స్థాయి అధికారులను, 83 బూత్ స్థాయి సూపర్వైజర్లను నియమించి ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలో ఓటర్లు జనాభా నిష్పత్తి 741, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 1002 గా నమోదయిందని అన్నారు. జిల్లాలో 18-19 సంవత్సరాల వయసు గల 18 వేల 153 మంది ఓటర్లను నమోదు చేశామని, 55 మంది ట్రాన్స్ జెండర్లు, 2 వేల 52 మంది సెక్స్ వర్కర్లను గుర్తించి ఓటర్ గా నమోదు చేశామని, 13 వేల 314 మంది దివ్యాంగులను ఓటర్లుగా గుర్తించి పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేశామని, జిల్లాలోని ప్రతి కళాశాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఓటర్లుగా నమోదు చేసినట్లు తెలిపారు.రెండవ విడత ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 10 వేల 172 దరఖాస్తులు స్వీకరించామని, నిర్దేశిత గడువులోగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టి ఆ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి జిల్లాలో లక్షా 4 వేల 164 ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డుల ముద్రణకు ఆర్డర్ చేశామని, వాటిలో నుంచి 38 వేల 545 కార్డులు పంపిణీ చేశామని, మరో 65 వేల 619 కార్డులు జిల్లాకు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తక్కువ పోలింగ్ నమోదైనట్లు గమనించామని, ప్రస్తుతం ఓటర్ అవగాహన కార్యక్రమాల నిర్వహణలో రామగుండంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.రామగుండం నియోజకవర్గం పరిధిలో సింగరేణి, ఎన్ టి పి సి , ఆర్ ఎఫ్ సి ఎల్, కేశోరాం సిమెంట్స్ వంటి సంస్థలు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి కార్మికులందరినీ ఓటరుగా నమోదు చేసే దిశగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అనంతరం పెద్దపల్లిలోని ఇండియన్ మిషనరీ స్కూల్, గోదావరిఖనిలోని విఠల్ నగర్ లోని అమరావతి హై స్కూల్ , ఎన్టిపిసి లోని సెయింట్ క్లెయిరీ స్కూల్ లో పోలింగ్ కేంద్రాలను రోల్ అబ్జర్వర్ సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులు ఇప్పటివరకు చేపట్టిన ఓటరు జాబితా సవరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పక్కడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని, ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా తప్పనిసరిగా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, హనుమా నాయక్, స్వీప్ ఆక్టివిటీస్ జిల్లా నోడల్ అధికారి రవూఫ్ ఖాన్, తహశీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .