వేద న్యూస్, ఎల్కతుర్తి:

కొడుకు సాకడం లేదని తండ్రి మూడెకరాల భూమిని సర్కారుకు అప్పజెప్పుతున్నట్టు పేర్కొన్న లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
లేఖ వివరాల ప్రకారం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రవాసి..గోలి శ్యాం సుందర్‌రెడ్డి (మాజీ ప్రజాప్రతినిధి-ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ) తన సొంత పట్టాభూమిని (మూడెకరాలు) ప్రభుత్వానికి దానం చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులకు తెలియపరిచి., వారి సమక్షంలో పత్రాలను ఇచ్చి సంతకం చేశామని, ఈ కాపీని స్థానిక తహశీల్ ఆఫీసుకు పంపగా, వారికి సదరు భూమికి హద్దులను నిర్ణయించాలని పై అధికారులు తెలియపరచారు.
2021లో కరోనా సమయంలో తన సతీమణి గోలి వసంత కొవిడ్ వైరస్ అటాక్ వల్ల అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తనను తన కుమారుడు నానావిధాలుగా దూషించారని, హన్మకొండలోని ఇంటి నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. తన ఆస్తులను అక్రమంగా తన కుమారుడు బదలాయించుకున్నారని ఆరోపించారు.
‘‘తల్లిదండ్రలను పట్టించుకోనివారికి వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని’’ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాను తల్లిదండ్రులను చూసుకోని వారి కి గుణపాఠం చెప్పే రీతిలో నిర్ణయం తీసుకున్నట్టు మాజీ ఎంపీపీ గోలి శ్యాం సుందర్‌రెడ్డి వెల్లడించారు. తాను దానం చేసే మూడెకరాల భూమిలో ప్రజోపయోగమైన పాఠశాల లేదా ప్రభుత్వ సంస్థ నెలకొల్పాలని, తన భార్య జ్ఞాపకార్థం ఆమె పేరు పెట్టాలని అధికారులను కోరుతున్నట్టు గోలి శ్యాం సుందర్‌రెడ్డి సదరు లేఖలో స్పష్టం చేశారు.
