- ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన
- మూల వాగు నుండి ఇసుక రవాణా నిలిపివేత
- ఇతర గ్రామాల ట్రాక్టర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు
వేద న్యూస్, కోనరావుపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మూల వాగు నుండి స్థానిక తాసిల్దార్ అనుమతితో ఇసుక రవాణా జరుగుతున్నది. ఈ క్రమంలోనే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇసుక తరలింపు అనుమతులు ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు కొండాపూర్ వాగుకు చేరుకుంటున్నాయి. దీంతో స్థానిక రైతులు,గ్రామస్తులు గురువారం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళన చేపట్టారు.
ఇతర గ్రామాల నుండి ఇసుక ట్రాక్టర్లు అధిక సంఖ్యలో వచ్చి ఇసుకను తరలించడం వలన కొండాపూర్ గ్రామ భూగర్భ జలాలు, గ్రామానికి నీటి సరఫరా చేసే నల్లల బావి త్వరగా అడుగంటిపోతాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో భవిష్యత్తులో పంటలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడతామని ఆవేదన చెందారు. తాసిల్దార్ కార్యాలయం జారీ చేసిన ఇసుక అనుమతులను కేవలం కొండాపూర్ గ్రామస్థులకు మాత్రమే పరిమితం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇతర గ్రామాల వారికి అనుమతులు ఇవ్వడం ఆపివేసి, గ్రామ భూగర్భ జలాలను కాపాడాలని వారు కోరారు. ఇసుక తరలింపు జరుగుతున్న చోట ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన తెలిపారు.
పరిస్థితి అదుపులోకి రావడానికి రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు.