• ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి :

ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ అధిక వ్యయ భారాన్ని రైతుపై మోపడమే కాకుండా భూసారాన్ని దిగమింగే పురుగుమందులను అంటగట్టడాన్ని నివారించాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ భామిని మండలంలో రైతులకు కావలసిన ఎరువులను ప్రైవేట్ డీలర్ల నుండి అధిక భారానికి కొనకోవాల్సి వస్తున్నదని, ప్రైవేట్ డీలర్లు పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ అధిక ధరలకు అమ్ముకుంటూ ఆంధ్ర రైతులకు అన్యాయం చేస్తున్నారు కావున విచారణ జరిపించి తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులకు కావలసిన ఎరువులను రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సరఫరా చేయాలని, జిల్లా రైతులను ప్రైవేటు వర్తకుల బారి నుండి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈవి నాయుడు,భామిని మండలం కార్యదర్శి కొత్తకోట బాబురావు నాయుడు,బుడితి మోహన రావు తదితరులు పాల్గొన్నారు.