వేద న్యూస్, కాసిపేట:

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు దేవాపూర్ ప్రాంతంలో భారీ స్థాయిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మార్గదర్శకత్వంలో, దేవాపూర్ ఎస్ఐ గంగారం నేతృత్వంలో, సీఐ శశిధర్ రెడ్డి (మందమర్రి), రామకృష్ణాపుర్,కాసిపేట,దేవాపూర్ స్టేషన్ల సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవాపూర్ పట్టణం పరిసర గ్రామాల్లో నిర్వహించిన ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రజల్లో నమ్మకాన్ని పెంచి, ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు తీసుకున్న కీలక అడుగుగా భావిస్తున్నారు. పోలీసుల భారీ ప్రదర్శనతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మరింత నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టారు.అధికారులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని,
చట్ట విరుద్ధ చర్యలు, ఓటర్లను బెదిరించడం, డబ్బు మద్యం పంపిణీ, అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేసిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని,
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత పోస్టులపై కూడా నిఘా ఉంచి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, అశాంతి కలగకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా సహకరించి ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా ముగించేందుకు తోడ్పడాలని కోరారు.“మీ భద్రత – మా బాధ్యత 24 గంటలు మీ సేవలో సిద్ధంగా ఉన్నాము” అని పోలీసులు ప్రజలకు సందేశం ఇచ్చారు.