•  ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఉంటుందని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం కరుణాపురంలో చర్చి ప్రార్థనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారిగా వరంగల్ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు నాయిని రాజేందర్ రెడ్డి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాబోయే రోజులలో మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పథకాలు ప్రతీ ఒక్కరికి అందుతాయని వెల్లడించారు. ఈ సందర్భంలో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ నాయిని రాజేందర్ రెడ్డి ని ప్రజలు గెలిపించడం సంతోషకరమని తెలిపారు. ఎవరూ కూడా అధైర్యపడొద్దని జనానికి సూచించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమ్మయ్య, సంపత్, అంకుష్, ఆనంద్ పాల్, రాజు, ప్రణీత్, వరంగల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.