•  ప్రతీ వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్యలు
  •  కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట:
ఉండేది పిడికెడే అయినా అవి చేసే పనులు చాలా గొప్పవి. అందుకే కిడ్నీలను మహా గట్టి పిండాలు అని అంటారు. చిక్కుడు గింజల ఆకారంలో ఉండే ఈ కిడ్నీలు చక్కగా పని చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారని, వాటికి ఏ మాత్రం చిక్కులు వచ్చినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతి 100 మందిలో సుమారు ఏడుగురికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమయింది. ఇది ఒక ఆందోళనకర గణాంకం కాగా, దీనికి ముఖ్య కారణాలు అధిక బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, తగినంత నీరు తాగకపోవడం, అజాగ్రత్తగా మందులు వాడటం మొదలైనవని ప్రముఖ వైద్యుడు, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. కిడ్నీల రక్షణకు, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలిపారు.

 

డ్రింక్ ఎనఫ్ వాటర్
ప్రతీ ఒక్కరూ తగినంత నీరు తాగాలని డాక్టర్ సురేశ్ సూచించారు. ప్రతీ రోజూ 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని (చలికాలంలో కొంచెం తక్కువ, వేసవిలో ఎక్కువ) అని స్పష్టం చేశారు. మూత్రం లేత పసుపు రంగులో ఉండాలి అంటే సరిపడా నీరు తాగాలన్నారు. రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పారు.

బీపీ ఎక్కువగా ఉండటం కిడ్నీలకు శత్రువు అని వివరించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలని, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలని, షుగర్ ఎక్కువగా ఉంటే కిడ్నీ ఫిల్టర్ యూనిట్లు (నెఫ్రాన్స్) దెబ్బతింటాయని చెప్పారు.

రెగ్యులర్‌గా ఫాస్టింగ్ చేసేవారు పీపీ షుగర్, హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకోవాలన్నారు. నొప్పి మందులు (పెయిన్‌ కిల్లర్స్) జాగ్రత్తగా వాడాలన్నారు. ఐబుప్రొఫెన్, డైక్లొఫెనాక్ మొదలైన.. లాంటివి ఎక్కువ రోజులు వాడితే కిడ్నీకి హాని ఏర్పడుతుందన్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ సూచనతో పెయిన్ కిల్లర్స్ వాడాలని స్పష్టం చేశారు.

లో సాల్ట్ ఫుడ్ తీసుకోండి
తక్కువ ఉప్పు, తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవాలని డాక్టర్ సురేశ్ వెల్లడించారు. ఉప్పు అధికంగా ఉండే పచ్చళ్లు, చిప్స్, ప్యాక్డ్ ఫుడ్ తగ్గించాలని, నాన్ వెజ్, రెడ్ మీట్ తగ్గించాలన్నారు. మద్యపానం, పొగ తాగడం పూర్తిగా మానేయాలని చెప్పారు.

 

మద్యపానం, ధూమపానం..రక్తనాళాల్ని దెబ్బతీసి కిడ్నీలకు హాని చేస్తాయని వెల్లడించారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని పేర్కొన్నారు. సీరమ్ క్రియాటినైన్, యూరిన్ అల్బమిన్, బీపీ, బ్లడ్, షుగర్ టెస్టులు 6 నెలలకు ఒకసారి చేసుకోవడం మంచిదన్నారు.

మైక్రోఆల్బమినురియ టెస్ట్ ఎర్లీ కిడ్నీ డ్యామేజీని వెల్లడిస్తుందని పేర్కొన్నారు. మూత్రం తరచుగా ఆపడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందని, అందుచేత ఎక్కువ సేపు ఆపుకోవద్దని సూచించారు. అధిక బరువు నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.

 

స్థూలకాయం (ఒబెసిటీ) వల్ల బీపీ, షుగర్ పెరిగి కిడ్నీ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. హెర్బల్, లోకల్ మందులు జాగ్రత్తగా వాడాలని చెప్పారు. కొన్ని ఆయుర్వేద / లోకల్ మందులలో హానికరమైన హెవీ మెటల్స్ ఉంటాయని, డాక్టర్ సలహా లేకుండా వాడొద్దన్నారు.

చివరి దశలోనే లక్షణాలు
కిడ్నీ వ్యాధులు సాధారణంగా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయని డాక్టర్ ఊడుగుల సురేశ్ స్పష్టం చేశారు. చివరి దశలో మాత్రమే లక్షణాలు (వాంతులు, అలసట, వాపులు, మూత్రం తగ్గడం) కనిపిస్తాయని, కాబట్టి ప్రమాదానికి ముందే పరీక్షలు చేసుకోవడం ఉత్తమమని వెల్లడించారు.