- ప్రైవేట్‌కు దీటుగా హాస్పిటల్‌లో సేవలు
- ఒకే శస్త్రచికిత్సలో కణితి తొలగింపు, సురక్షిత ప్రసవం
- ప్రభుత్వ దవాఖానాపై నమ్మకం రెట్టింపయిందన్న పలువురు
- డాక్టర్లు, వైద్య సిబ్బందికి పేషెంట్ తరుఫు వారి సన్మానం
వేద న్యూస్, హుజురాబాద్:
సర్కారీ ఆస్పత్రిలో సక్కని వైద్య సేవలు అందాయని పేషెంట్ తరఫు వారు సంతోషం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే..జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బోగ భిక్షపతి – కరుణ దంపతుల కుమార్తె ప్రవళిక, గత నెల 30న (గురువారం) హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఇది ప్రవళికకు రెండో కాన్పు కాగా, ఆమె మొదటి ప్రసవం కూడా ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. అయితే, రెండో కాన్పు సమయంలో ప్రవళిక గర్భాశయంలో కణితి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రి పై ఉన్న అపార నమ్మకంతో, ప్రవళిక కుటుంబసభ్యులు ఇక్కడే చికిత్సకు మొగ్గు చూపారు.ఆ నమ్మకాన్ని సర్కారీ దవఖాన వైద్యులు నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అత్యంత నైపుణ్యంతో ఒకే శస్త్రచికిత్సలో కణితి తొలగింపు, ప్రసవం రెండింటినీ విజయవంతంగా నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో గర్భాశయాన్ని తొలగించకుండానే కణితిని తొలగించారు. ప్రవళిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, క్లిష్టమైన చికిత్సలు కూడా సురక్షితమైనవి, నమ్మకమైనవని మరోసారి రుజువైందని ప్రవళిక భర్త మంతెన ప్రవీణ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిపై తమకున్న నమ్మకం రెట్టింపు కావడంతో, ఆయన మంగళవారం రోజున ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించి, స్వీట్లు పంచి కృతజ్ఞతలు తెలియజేశారు.