- ‘ఆదర్శ’ ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ కాలేజీగా..
- విద్యార్థి ఉద్యమాలు, పోరాటాలకు నెలవు
- ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహావృక్షం
వేద న్యూస్, జమ్మికుంట:
ఎంతో మంది మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రముఖులను సమాజానికి అందించిన విద్యావనం ‘జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ’. మొక్కగా 1965లో మొదలైన ఈ కాలేజీ మహావృక్షంగా ఎదిగి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కరీంనగర్ జిల్లాలోని సుమారు 50 గ్రామాలకు సెంటర్ పాయింట్‌గా జమ్మికుంట పట్టణకేంద్రంలో ఉన్న ఈ విద్యాకేంద్రం..చైతన్య దీపికగా, విద్యార్థి ఉద్యమాలకు, పోరాటాలకు నెలవుగా నిలుస్తోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్న జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఘనచరిత్రపై ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..
జమ్మికుంట పట్టణ నడిబొడ్డున, ప్రభుత్వాస్పత్రికి సమీపాన సువిశాల ప్రాంగణంలో జాజి రంగులో ఠీవిగా తలెత్తుకుని నిలిచిన అద్భుతమైన విద్యాకేంద్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. జమ్మికుంట, పరిసర గ్రామాల ప్రముఖులు కలిసి ‘ఆదర్శ విద్యా సమితి’ అనే విద్యాసంస్థను స్థాపించారు. దీనికి కెవి నారాయణరెడ్డి అధ్యక్షుడు. హుజూరాబాద్ సమీపంలోని సైదాపూర్ వీరి స్వగ్రామం. ఈ విద్యాసమితి సభ్యులు ఎక్కటి అన్నారెడ్డి, అనుగం దుర్గయ్య, ఎర్రంరాజు కృష్ణంరాజు, పి.జనార్దన్‌రెడ్డిల కృషితో ఆదర్శ కాలేజీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. 1965 సెప్టెంబరు 6వ తేదీన ఈ కాలేజీ ‘ఆదర్శ కాలేజ్ ఆఫ్ సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్’గా కొత్త వెంకట (కెవి) నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. పీయూసీ కోర్సులతో 50 మంది స్టూడెంట్స్‌తో కాలేజీ మొదటి బ్యాచ్ విద్యాభ్యాసం జరిగింది. 1980ల దశకంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండగా, 2008 నుంచి శాతవాహన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారింది. కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా శ్రీపతి రంగనాథ వ్యవహరించారు. 1965-66 విద్యా సంవత్సరంలో వార్షికోత్సవానికి నాటి ఆర్థిక మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఘనచరిత్ర కాలేజీ సొంతం
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పూర్వ విద్యార్థులు ఎందరో సమాజానికి విశేషమైన సేవలందించారు..అందిస్తున్నారు. నల్ల ఆదిరెడ్డి, శనిగరపు వెంకటేశ్వర్లు (సాహు), నల్ల సుధాకర్ రెడ్డి, చంద్ర ప్రభాకర్, తాటికొండ సుధాకర్‌రెడ్డి, ఆర్.సాంబశివరెడ్డి, అల్లం వీరయ్య, మాసాని రవీందర్, ఈటల సమ్మన్న, రజిత, బయ్యపు దేవేందర్‌రెడ్డి వంటి వారు ఈ కాలేజీలో చదువుకున్నారు. బడిపాఠాలతో పాటు బతుకు పాఠాలను విద్యార్థులకు ఈ కాలేజీలో పని చేసిన ఎందరో గురువులు నేర్పారు, ప్రస్తుత టీచర్లు నేర్పుతున్నారు. ఈ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసిన తిరుపతయ్య ఎందరో యువకుల్ని వామపక్ష ఉద్యమాల వైపు ఆకర్షించే విధంగా ప్రభావితులను చేశారు. తిరుపతయ్య రాసిన ‘బద్‌లా’ కథల పుస్తకం ప్రభుత్వంచే నిషేధించబడింది. తీవ్ర నిర్బంధం, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తను కలలు గన్న లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమయ్యే కేడర్‌ను తిరుపతయ్య కాలేజీ నుంచి ప్రజాక్షేత్రానికి పంపగలిగారు. ఎన్‌సీసీ ఆఫీసర్‌గా తిరుతయ్య వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ పరిపాటి కొండాళ్ రెడ్డి, గాదె ధర్మారెడ్డి వంటి ప్రముఖులు కాలేజీలో అధ్యాపకులుగా పని చేశారు. కాలేజీలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు.
కాలేజీలో ఆరోగ్యకరమైన వాతావరణం
1965లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎయిడెడ్ డిగ్రీ కాలేజీగా ప్రారంభమై..1982లో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. 2017లో స్వర్ణోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకుంది. 1965 నుంచి నిర్విరామంగా ఈ విద్యావనం సౌరభాలను పంచుతూనే ఉంది. కాలక్రమానికి అనుగుణంగా నూతన కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తూ..వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసి చక్కటి పుస్తకాలు కాలేజీ లైబ్రరీలో సుమారు 6,500 పుస్తకాలున్నాయి. సువిశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు చక్కటి వాతావరణం డిగ్రీ కాలేజీలో ఉంది. పచ్చని చెట్లు, విశాల ప్రాంగణంలో హాయిగా విద్యార్థులు సాయంకాలం మైదానంలో నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. ప్రస్తుతం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్‌గా డి.రాజశేఖర్ ఉన్నారు.
కాలేజీలో అన్ని వసతులున్నాయి: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ) డి.రాజశేఖర్
కాలేజీలో అన్ని వసతులున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించిన అధ్యాపకులు ఉన్నందున విద్యార్థులు ఈ కాలేజీలో చేరి మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. కాలేజీలోని టీజీ కేసీ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవచ్చు. ఎన్ఎస్ఎస్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాలేజీలో బీఏహెచ్.ఈ.పీ, బీఏ ఆఫీస్ మేనేజ్‌మెంట్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, బీఎస్సి డైరీ, బీఎస్సీ క్రాఫ్ ప్రొడక్షన్, బీఎస్సి బీ. జెడ్. సీ, బీ ఎస్ సీ బీ.జెడ్.సీ.ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.