•   ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన
  •  సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజం
  • జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి

వేద న్యూస్, కమలాపూర్:

ఈ నెల 4న (శుక్రవారం) ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘హాస్టల్ సీటు ఇప్పించరూ!’ శీర్షికన ప్రముఖంగా ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కే. ఏ. గౌస్ హైదర్ స్వయంగా ఆయనే.. కమలాపూర్ మండల పరిధిలోని కాసింపల్లిలోని విద్యార్థిని సయ్యద్ సబ్జాన్.బి. ఇంటికి వెళ్లి విద్యార్థినితో, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

వారి సమస్య ఏంటో వివరంగా తెలుసుకున్నారు. వెంటనే సబ్జాన్‌కు హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు హామీ ఇచ్చారు. నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ కూడా గొప్పగా చదువుకోవాలనే ఆశయంతో సబ్జాన్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రోజుకు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ మరీ సబ్జాన్ పాఠశాలకు వెళ్లడం నిజంగా అభినందించదగ్గ విషయమని, విద్యార్థినిని అభినందించారు.

ప్రతి మైనార్టీ విద్యార్థికి హాస్టల్ సీటు ఉచితం

గొప్పగా చదువుకొని జీవితంలో గొప్పగా స్థిరపడాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్క మైనారిటీ విద్యార్థికి హాస్టల్‌లో ఉచితంగా సీటు ఇస్తామని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కే. ఏ. గౌస్ వెల్లడించారు. ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్క మైనార్టీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైనారిటీ హాస్టల్‌లో చాలా చక్కటి వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి విద్యా బోధనతో పాటు పౌష్టికమైన ఆహారాన్ని, విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇంకా అనేక రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

చదువుపై ఆసక్తి ఉండి గొప్పగా చదువుకొని.. భవిష్యత్తులో గొప్పగా స్థిరపడాలని ఆశయమున్న ఏ ఒక్క మైనార్టీ విద్యార్థి అయినా.. తన దగ్గరికి వస్తే ఉచితంగా సీటు ఇచ్చి చదువుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో తన ఆఫీసు ఉంటుందని, నేరుగా వచ్చి కలిసినా లేదా 98490 78550 ఫోన్ నంబర్‌లో అయినా సంప్రదించొచ్చని స్పష్టం చేశారు.

సమస్య పరిష్కారానికి ‘వేద న్యూస్’ చొరవ

4 కి.మీ. కుంటుతూ స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సబ్జాన్ అనే విద్యార్థిని సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి, తమ దృష్టిలో పడేలా చేసి, తమను విద్యార్థిని ఇంటికి వచ్చేలా చేసి.. సమస్యకు పరిష్కారం చూపేలా చొరవ చూపించిన ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రికకు ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కే. ఏ. గౌస్ అభినందనలు తెలిపారు.

ఇలాంటి సమస్యలు వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజమని, విలువలతో కూడిన జర్నలిజం అని.. అలాంటి పని చేస్తున్న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రికను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన వెంట టీచర్లు రమాదేవి, ఆసియా పర్వియా ఉన్నారు.