•  రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పొన్నం ప్రభాకర్

వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. తొలిసారి తమ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అనూహ్యంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ సాధించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడిని నిజం చేస్తూ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని సైతం ఒప్పించి..మంత్రాంగం నెరిపి సక్సెస్ అయ్యారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్ కుమార్ వొడితలపై దాదాపు 20 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఒక్కరూ మంత్రి కాలేదు. తొలుత ఈ నియోజకవర్గం ఇందుర్తి, నుస్తులాపూర్ గా ఉన్న అప్పుడూ ఎవరినీ మంత్రి పదవి వరించలేదు. కాగా, ఈ సారి తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయ్యారని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తోంది. సిద్దిపేట జిల్లాతో పాటు కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ దశ-దిశను మంత్రి పొన్నం ప్రభాకర్ మారుస్తారని జనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.