వేద న్యూస్, కరీంనగర్:
గవర్నర్ కోటాలో ఎట్టకేలకు చట్టసభలలోకి ప్రొఫెసర్ కోదండరామ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ‘నాడు’ ఉద్యమసారథిగా ఉన్న కోదండరామ్..గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉండగా, అప్పుడు కోదండరామ్ కు ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

తాజాగా ఆచరణలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టుకుంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ను తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ మంత్రిగా నియమించే అవకాశాలున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కోదండరామ్ వంటి మేధావికి విద్యా శాఖ మంత్రి పదవి వరిస్తే యువత, నిరుద్యోగలోకానికి ఉద్యోగాల భర్తీ పట్ల సానుకూల సంకేతాలు పంపినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని టీజేఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

యావత్ తెలంగాణ సమాజం ముఖ్యంగా యువత, నిరుద్యోగ లోకం ప్రొఫెసర్ కోదండరామ్ నిబద్ధత పట్ల గౌరవం కలిగి ఉంది. నిరుద్యోగ, యువత పక్షాన పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కోదండరామ్..ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ప్రొఫెసర్ గా పని చేసిన కోదండరామ్ ..విద్యా శాఖ మంత్రిగా అన్ని విషయాల పట్ల అవగాహనతో ఆచి తూచి వ్యవహరిస్తారని టీజేఎస్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియను సాఫీగా సాగించడంలో కోదండరామ్ మంత్రిగా కీలక భూమిక పోషించే అవకాశాలుంటాయని పలువురు నిరుద్యోగులూ పేర్కొంటున్నారు.

అనేక ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యువత, నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడంలో విఫలమైన గత సర్కారు మాదిరిగా కాకుండా..నూతన ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా కోదండరామ్ తన వంతు పాత్రను పోషిస్తారని టీజేఎస్ నాయకులు కొందరు చెప్తున్నారు.

తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన్ను మేధావిగా, ఉద్యమసారథిగా ప్రజలు, యువత గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ కు అవకాశం ఇస్తే మంచిదే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగానే వైరలవుతున్నాయి. ఈ విషయమై టీజేఎస్ నాయకులను సైతం సంప్రదించగా వారు కూడా కోదండరామ్ కు మంత్రి పదవి వరిస్తుందనే ఆశాభావంతోనే ఉన్నట్లు చెప్తున్నారు.