వేద న్యూస్, జమ్మికుంట:

ప్రస్తుత ‘స్మార్ట్’ యుగంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు ఎంతలా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దాదాపుగా అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, అతిగా ఫోన్ యూజ్ చేయడం వల్ల మనిషిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా నిద్రకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

 

వ్యాయామం తప్పనిసరి

 

ప్రస్తుత ఉరుకుల పరుగుల ఆధునిక జీవనశైలిలో మనుషులు ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుండటం గమనించొచ్చు. ఇక గాడ్జెట్‌ల వినియోగం, పని ఒత్తిడి వల్ల వారు సరైన నిద్రకు దూరమవుతున్నారు.

సాధారణంగా ఒక వయోజనుడికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. కానీ, నగర జీవితంలోనే కాదు గ్రామీణ జీవితంలోనూ కొందరు నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫలితంగా మానసిక అలసట, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయి.

సరైన నిద్రపోవడానికి ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం తప్పనిసరిగా చేయాలి. నిద్రకు ముందు మొబైల్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తగ్గించడం, కాఫీన్ పానీయాలను తగ్గించడం, సాధారణ వ్యాయామం చేయడం అవసరం. సమస్య దీర్ఘకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం: డాక్టర్ ఊడుగుల సురేశ్, ఎండీ జనరల్ ఫిజీషియన్ 

ప్రతీఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలంటే సరైన సమయానికి నిద్రపోవడం ఉత్తమం. రోజుకు 7 నుంచి 8 గంటల వరకు నిద్ర తప్పనిసరిగా అవసరం. నిద్రకు ముందుస్మార్ట్ ఫోన్‌లు అతిగా చూడటం మంచిది కాదు. పని ఒత్తిడి వల్ల అలసి.. ఇంటికి వచ్చాక కూడా కొందరు స్మార్ట్ ఫోన్లలో సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో కునుకు తీయడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్‌ను పడుకునే ముందర దూరంగా ఉంచడం ఉత్తమం.