నా ప్రియమైన మాతృభూమిని నేను చూస్తున్నప్పుడు, దాని భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నా. అల్లకల్లోలం, అనిశ్చితి తుఫానులతో చుట్టుముట్టబడి దేశం ఉంది. రేపటి తరాల ఆలోచన నా హృదయాన్ని భారంగా మారుస్తోంది. మనం వదిలి వెళ్లే ప్రపంచం అవకాశాల కంటే సమస్యల వారసత్వంగా ఉండవచ్చని నేను భయపడుతున్నా. చిన్నప్పుడు మనం విన్న గొప్ప గొప్ప వీరులు, పూర్వీకులు, స్వాతంత్ర్య సమరయోధుల కథలను ఆదర్శంగా భావించాం. వాటిని యువత అంతగా పట్టించుకున్నట్టు కనిపిస్తలేదు. యువత‌పైనే దేశ భవిష్యతు ఆధారపడి ఉంది. గొప్ప ఆలోచనతో ఉండాల్సిన యువత తప్పు దారిలో పోతే దేశ భవిష్యత్తు ఏంటి? అనేది ప్రశ్నగానే మిగులుతోంది. ప్రపంచంలో అన్ని దేశాల కన్న ఎక్కువ యువత భారతదేశంలో ఉంది. ఆ యువత పెడదోవ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మాదకద్రవ్యాలు, విధ్వంసక ఆకర్షణకు ఎక్కువగా యువత లొంగిపోతున్నది. వ్యసనం, వినాశకరమైన ప్రభావాలకు లోనై.. శక్తిమంతమైన తమ సామర్థ్యాన్ని యువత కోల్పోతున్నది. తరచుగా మోహం.. నీడలలో ఉండి, ముందు ఉన్న విస్తారమైన అవకాశాలను పట్టించుకోవడం లేదు. జెండాలు పట్టి జగం ఏలుతున్నట్టు భావిస్తున్నది కానీ, పగ్గాలు పట్టి వారిని నడిపిస్తున్నది ఎవరో తెలుసుకోక తప్పు దారి పడుతున్నది. భవిష్యత్తులో వచ్చే విపత్తులు గుర్తించక తాత్కాలిక సంతోషం కోసమే బతుకుతున్నది.

అలా యువత తమ విలువైన యవ్వనాన్ని దేనికి పనికి రాకుండా తెలియకుండానే వృథా చేస్తున్నది. కొందరు యువతీయువకులు తమ సోమరితనంతో తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. తమ తల్లిదండ్రుల కలలను కాల్చి వేస్తున్నారు. రేపటి తరం బాగుండాలి అంటే ఇప్పుడు మనం కష్టపడాలి అనే భావన యువతలో కలగాలి. మన తల్లిదండ్రుల గౌరవాన్ని మన దేశ ఔన్నత్యాన్ని మనమే కాపాడాలి. ‘ఎముకలు కుళ్లిన వయసులు మళ్లినా సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండిన సైనికులారా రారండి’ అని శ్రీ శ్రీ ఇచ్చిన సందేశాన్ని స్వీకరించాలి. సైనికులై మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి, మన భవిష్యత్తు తరాలకు బాటలు వేయాలి.

ఎస్.వినీత్,(జగిత్యాలవాసి),
ఇండియన్ నేవీ పుణె(మార్కో),
సెల్: 91373 29184.