వేద న్యూస్, వరంగల్:

ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఇండ్ల’ కార్యక్రమం చేపడుతోంది. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కృషి చేస్తోంది. దశల వారీగా డబ్బులను అర్హులకు అందజేస్తోంది. కాగా, తమకు అర్హత ఉన్నప్పటికీ ఇల్లు రాలేదని, తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఈ నిరుపేద కుటుంబం దీనంగా వేడుకుంటోంది.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ బీఆర్ నగర్ కాలనీకి చెందిన దుస్స పరమేశ్వరి కుటుంబం సొంతిల్లు లేక అవస్థలు పడుతోంది. రేకుల ఇంట్లోనే అష్టకష్టాలు పడుతూ.. జీవనం సాగిస్తోంది. కుమారుడు రాకేశ్ ఆటో డ్రైవర్ కాగా, పరమేశ్వరి కూలీ పనులు చేస్తోంది. కాగా, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేరు రాలేదని రాకేశ్ పేర్కొంటున్నారు. 

 

కొద్దిపాటి వర్షం కురిసినా తమ ఇల్లు నీటితో నిండిపోతుందని, తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించానలి అధికారులను రాకేశ్ వేడుకుంటున్నాడు. అర్హతలు ఉన్న వారికే ప్రజాప్రభుత్వంలో ఇండ్లు రావాలని తాము కోరుతున్నామని, తమకు అర్హత ఉందో.. లేదో .. అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి చూసుకోవాలని కోరుతున్నారు.

నిరుపేదలమైన తమ సొంతింటి కల సాకారానికి ప్రజా ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సాయం చేయాలని, తమకు ఇల్లు ఇప్పించాలని తల్లి కొడుకులు పరమేశ్వరి, రాకేశ్ వేడుకుంటున్నారు.