•  జీవిత పాఠాలూ బోధించే టీచర్
  •  కవిగా, గాయకుడిగా, బోధకుడిగా బహుముఖ పాత్రలు
  •  జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు అధ్యాపకుడిగా రేణ సేవలు ప్రత్యేకం

వేద న్యూస్, జమ్మికుంట:
అధ్యాపకుడిగా తన వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తిస్తున్న ఆదర్శ గురువు రేన ఈశ్వరయ్య. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈశ్వరయ్య..అధ్యాపకుడిగా పాఠాలు బోధిస్తూనే..కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటూ నిత్యవిద్యార్థిగా ఉంటుండటం విశేషం. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని జ్ఞానాన్ని బోధిస్తూ..ప్రాపంచిక దృక్పథాన్ని, ప్రజల కోసం ఆలోచించే దృష్టికోణాన్ని అందించేందుకు రేణ ఈశ్వరయ్య మార్గనిర్దేశనం చేస్తూ..విద్యార్థులు రేపటి పౌరులుగా చక్కటి సామాజిక స్పృహ కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.

సామాజిక స్పృహ కలిగిన గురువు

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈశ్వరయ్య..సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. పాఠాలను జీవితానికి అన్వయిస్తూ..రసజ్ఞతను జోడిస్తూ బోధించడంలో దిట్ట. సమాజంలో జరుగుతున్న ఘటనలను చూసి తన కలం ద్వారా పాటలను రచించి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయగలరు. జీవితం తెలిసిన వ్యక్తి కాబట్టి..విలువలకు కట్టుబడి..స్వార్థాన్ని పక్కనపెట్టి సమాజ శ్రేయస్సుకు కట్టుబడి ఉండాలనే విలువలను ఆచరణలో పాటిస్తూ..విద్యార్థులకూ బోధిస్తున్నారు.

సమసమాజమా ఇది నీకు న్యాయమా!, నవసమజామా ఇంత ఘోరమా!’ అనే పాటలో ఈశ్వరయ్య వర్తమాన అంశాలను ప్రస్తావించి..జరుగుతున్న తప్పులను ఎత్తిచూపారు. సమాజంలో, దేశంలో ఉన్న పరిస్థితులు, వర్తమాన సమాజంలోని రుగ్మతలు, రాజకీయం ఇలా ఒక్కటేమిటీ..దాదాపుగా అన్ని అంశాలను తన కలం ద్వారా స్పృశించారు. ఈ పాటను తన గొంతు ద్వారా ఆలపిస్తూ..సమసమాజంలో నెలకొన్న పరిస్థితుల్లో మార్పు జరగాలనే బలమైన సంకేతాన్నీ ఈశ్వరయ్య పంపుతున్నారు.

టీచర్ అంటే వేళకు వచ్చి.. పాఠాలు బోధిస్తూ..సమయం కాగానే వెళ్లిపోవాలనే కృత్రిమ వాతావరణానికి పరిమితం కాకుండా..పాఠాలకు విలువలను జోడించి పరిజ్ఞానాన్ని అందిస్తూ..పబ్లిక్ ఇంటలెక్చువల్‌గా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు. కవిగా, బోధకుడిగా, గాయకుడిగా బహుముఖ పాత్రలను అత్యంత ఇష్టంగా రేన ఈశ్వరయ్య పోషిస్తున్నారు.

మట్టిలో మాణిక్యం రేణ
హన్మకొండ జిల్లాలోని ప్రస్తుత వేలేరు మండలం పూర్వం భీమదేవరపల్లి మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామానికి చెందిన సర్వయ్య-గౌరమ్మ దంపతులకు జన్మించిన ఈశ్వరయ్య..జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో బీకాం డిగ్రీ చేసిన రేణ..కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో పీజీ చేశారు.

అనంతరం వివిధ విద్యాసంస్థలలో ప్రైవేటు టీచర్‌గా పని చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పాత్రికేయుడిగాను కొంత కాలం విధులు నిర్వర్తించారు. అనంతరం ప్రభుత్వ అధ్యాపకుడిగా కొలువు సంపాదించారు. 2012 సెప్టెంబర్ 13న ప్రభుత్వ జూనియర్ కాలేజీ వీణవంకలో అధ్యాపకుడిగా చేరిన ఈశ్వరయ్య..అక్కడ నాలుగేండ్ల పాటు పని చేశారు. అనంతరం ప్రమోషన్‌పై 2016 జూలై 31న ఇల్లందు ప్రభుత్వ కాలేజీకి వెళ్లారు. సుమారు రెండేండ్ల పాటు అక్కడ విధులు నిర్వర్తించిన తర్వాత 2018 జూన్ 30న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జమ్మికుంటకు బదిలీ అయ్యారు.