వేద న్యూస్, బ్యూరో:

కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయి!. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ర్యాంకుల వేటలో తమ స్వలాభం కోసం మార్కెట్‌లో నంబర్ వన్‌గా నిలవాలనే ప్రయత్నంలో భాగంగా స్టూడెంట్స్‌పైన కొన్ని విద్యా సంస్థలు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాయని, చదువుకోవాల్సిందేనని వారిపై భారం మోపుతుండటంతో వారు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

తాజాగా హనుమకొండ లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీకి సంబంధించిన వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నారు. ఫ్యాన్ కు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాగా, చదువులో రాణించలేక ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు.

 హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సదరు విద్యార్థిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలలపిస్తున్నారు.  శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.