వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
సైబరాబాద్ పరిధిలోని నలగండ్ల లో నిర్మించబోయే అతి పెద్ద ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కొండా సురేఖ భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో వారిపాత్ర గొప్పదని కొనియాడారు. వారు కృష్ణతత్వాన్ని బోధించడంతో పాటుగా పేదవారికి ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో నేను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి కోసం కాళ్లు అరిగేలా తిరిగారని అయినా వారికి స్థలం కేటాయించలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఇస్కాన్ దేవాలయం నిర్మాణం కోసం 6000 గజాల భూమిని 22 సంవత్సరాల పాటు లీజ్‌పై కేటాయించినట్లు తెలిపారు. ఇస్కాన్ దేవాలయం నిర్మాణంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజానికి మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇస్కాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.