•  జీపీవోలుగా సమ్మతిలేని జూనియర్ సహాయకులకు బాధ్యతలా?
  •  వీఆర్ఏ, వీఆర్వోల ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం ఎప్పుడని ప్రశ్నలు

వేద న్యూస్, వరంగల్:

భూభారతి చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి గ్రామ పాలన అధికారులను(జీపీవో) నియమించాలని నిర్ణయం తీసుకుంది. జీపీవోలకు త్వరలో నియామక పత్రాలు సీఎం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జీపీవోల కేటాయింపు విషయానికొస్తే.. వరంగల్ జిల్లాలో 174 క్లస్టర్లకు గాను 177 మంది జీపీవో పరీక్షలో అర్హత సాధించారు.

కాగా, ఇందులో కొందరు ఈ పోస్టులో పని చేయడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కొందరిని మహబూబాబాద్ జిల్లాకు అలాట్ చేయాలని సీసీఎల్‌ఏ అప్రూవల్ కోసం పంపారిని వినికిడి. ఇలా చేయడం వల్ల జీపీవో పోస్టుకువిముఖంగా ఉన్న మండలాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌లను ఇన్‌చార్జి జీపీవో‌గా తీసుకునే అవకాశం ఉంది.

జీపీవోగా అర్హత సాధించిన వారికి ర్యాంకు ద్వారా కౌన్సెలింగ్ ఏర్పాటు చేసి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నందున.. వారు ఎంచుకున్న మండలాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ, జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న వారికి ఇన్‌చార్జి జీపీవోలను చేస్తే.. వారు సుదూర మండలాలకు వెళ్లే అవకాశాలున్నాయి.

ఇలా చేస్తే వీఆర్ఏ‌గా ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేకుండా పోతోందని, ఇలా జీవితాంతం ఉద్యోగ భద్రత లేకుండా పోరాటాలు చేయాల్సిందేనా? అని కొందరు జూనియర్ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనగామ జిల్లాలో ప్రతీ మండలం‌లో రెండు క్లస్టర్స్‌ను ఖాళీగా ఉంచి మండలంలో ఉన్న జీపీవో అర్హత పరీక్ష రాయని వారికి కేటాయించినట్టు సమాచారం. వరంగల్ జిల్లాలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలలో పని చేసే జూనియర్ సహాయకులకూ అన్యాయం జరుగుతుంది కావచ్చని సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.