– కాల్గరీ కెనాడాలో ఘనంగా గణేశ్ నవరాత్రులు
– కన్నుల పండువగా టౌన్ డౌన్ వీధుల్లో బొజ్జ గణపయ్య ఊరేగింపు

ఒట్టావా: భారతదేశంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఎంత వైభవోపేతంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, విదేశాల్లోనూ గణపతి ఉత్సవాలను ఘనంగానే నిర్వహించుకున్నారు. కెనడా దేశంలోని కాల్గరీ కెనడా‌లో అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, షిర్డీ సాయిబాబా మందిర  ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. లంబోధరుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో బొజ్జ గణనాథుడి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజ్‌కుమార్ శర్మ మందిరంలో ప్రతీ రోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము, హారతులు విధిగా నిర్వహించారు.

గణపతి నవరాత్రి, ఊరేగింపు సంబురాలు ఘనంగా నిర్వహించుటకు చాలా మంది వాలంటీర్లు, వ్యాపార యజమానులు తమ  ప్రత్యేక సహాయాన్ని అందించారు. నగర వీధుల్లో గణనాథుడి ఊరేగింపు కోసం హెచ్అండ్హెచ్ డెకర్స్, హేమ, హర్షిణి ట్రక్‌ను ఎంతో అందంగా అలంకరించారు. గణనాథుని ఊరేగింపు యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే పీటర్ సింగ్ హాజరయ్యారు. గణనాథుడి ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాల్గరీ నగరంలో ఇలాంటి దైవ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. మరిన్ని భారతీయ సంప్రదాయాలను చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమలను నిర్వహించాలని కోరారు. అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు, నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు జరుపుతున్నందుకు లలిత, శైలేష్‌ను ఎంతగానో అభినందించారు. గణపతి ఉరేగింపును అర్చకులు రాజ్ కుమార్ గణపతి తాళం, అర్చన, హారతి తో ప్రారంభించగా..భక్తులు ‘జై బోలోగణేష్ మహరాజ్ కి జై’ అనే నినాదాలతో యాత్ర కొనసాగించారు. లోహిత్, ఓం సాయి, ఫణి భజనలతో, పాటలతో గణపతిని స్తుతించారు.

ఆనందంతో భక్తుల నాట్యం
కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ చేరుకునే వరకు సుమారు ఐదు వందలకు పైగా భక్తులు హాజరయ్యారు. వారందరూ ఆనందంతో నాట్యం చేస్తూ  గణపతి నామ సంకీర్తన చేశారు.  ఉత్తర అమెరికా ఖండంలో ఇలాంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం, సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రానున్న భావితరాలకు భారత సంప్రదాయ విశిష్టతలను తెలిపే ప్రయత్నం చేశారని పలువురు కొనియాడారు. ఊరేగింపు ముగిసిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. కెనడాలో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్  కచేరీ‌లో కెనడాలో, యూఎస్ఏలో ఉన్న విద్వాంసులైన ఆరతి శంకర్, అంజన శ్రీనివాసన్ వయోలిన్ వాయించగా, ఆదిత్య నారాయణ్ మృదంగంతో, రమణ ఇంద్ర కుమార్, ఘటంతో, రత్తన్ సిద్ధు, తంబురాలతో సహకరించారు.

‘కాళి’గిరిగా కాల్గరీ నగరం
విద్వాంసుల అందరిని అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు. అక్టోబర్ మాసంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం, అర్చకులు రాజ్‌కుమార్ ఘనమైన సన్నహాలు జరుపుతున్నారు. అనఘా దత్త సంఘం వారు నిర్వహించు దేవి నవరాత్రి వేడుకలతో,  కొన్ని వేల మంది భక్త జన సమూహంతో  పూజలనందుకునే అనఘా అమ్మవారి వేడుకల వల్ల కెనడా‌లో కాల్గరీ నగరం ‘‘కాళి’’గిరి గా మారుతుందని భక్తులు తమ సంతోషాన్ని  వ్యక్తపరిచారు. లలిత, ఎందరో వాలంటీర్లు రేయింబవళ్లు శ్రమించి వేడుకలను నిర్వహించారు.  ఈ గణేశ్ నవరాత్రి వేడుకల్లో సుమారు 800 మందికి పైగా భక్తులు పాల్గొనగా, ఈ వేడుకలు జయప్రదంగా ముగిశాయి.