- జమ్మికుంట మహిళా కాంగ్రెస్ నేతల పిలుపు
- ప్రణవ్ నాయకత్వంలో హుజురాబాద్ నుంచి లక్ష మెజారిటీ
- కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావు గెలుపుపై కాంగ్రెస్ లీడర్ల ధీమా
వేద న్యూస్, జమ్మికుంట:
ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ కోరారు. ఆదివారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జమ్మికుంటకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపునకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి హుజురాబాద్ నుంచి లక్ష మెజారిటీ వచ్చే విధంగా బూత్ లెవెల్ లో నాయకులు పనిచేయాలని ప్రణవ్ సూచించినట్టు పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసినట్లు గుర్తు చేశారు. 6 గ్యారెంటీలలో ఎక్కువ అంశాలు మహిళలకు సంబంధించినవే ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని, 10 ఏళ్ల కాలంలో వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు ఉండబోదని వెల్లడించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం మహిళలు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను హస్తం పార్టీ హస్త’గతం’ చేసుకోబోతున్నట్లు జోస్యం చెప్పారు.
సభకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, సత్యనారాయణ తదితర కాంగ్రెస్ అతిరథ మహారథులు, చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు రేణుక శివకుమార్ గౌడ్, బుర్ర వాణి, మాచర్ల స్వప్న, కందుల సరోజ, పెరుమాండ్ల రజిత తదితరులు పాల్గొన్నారు.