వేద న్యూస్ , హైదరాబాద్ :

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రేస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ఎంపీగా ఉండి ప్రతిపక్ష నాయకుడిపై అవమానకరమైన రీతిలో అనుచితమైన భాషను ఉపయోగించడాన్ని వారి పార్టీ బీజేపీ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. కంగనా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకుని రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ నోరుపారేసుకుని సమాజంలో అప్రతిష్ట మూటకట్టుకోవటం సరికాదని హెచ్చరించారు. కంగనా రనౌత్‌కు వివాదాలు కొత్తకాదని ఎంపీ అయ్యాక కూడా తన ప్రవర్తన మార్చుకోకపోవటం దురదృష్టకరం అన్నారు. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా వ్యాఖ్యలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆమె అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విలువలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. దేశ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ పై వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్య విలువలకు హానికరమని చెప్పారు. ఒక మహిళగా, ప్రజాప్రతినిధిగా కంగనా రనౌత్ బాధ్యతగా మాట్లాడాలని, నియంత్రణ పాటించాలని కోరారు. కంగనా తన పద్దతి మార్చుకోకుంటే మహిళా కాంగ్రెస్ ఆమెకు తగిన బుద్దిచెబుతుందని హెచ్చరించారు. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, మహిళా కాంగ్రేస్ అధ్యక్షురాలు అల్కాలాంబాల మార్గనిర్దేశనంలో మహిళా కాంగ్రెస్ గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తుందని చెప్పిన స్వర్ణ మా నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేసినవారికి తగిన సమాధానం చెప్పేందుకు వెనకాడమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *