•  ‘వీబీ జీ రామ్ జీ’ని వ్యతిరేకిస్తున్నాం
  •  ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధిరాజు

వేద న్యూస్, హైదరాబాద్:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న “వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)” చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కంకాల సిద్ధిరాజు పేర్కొన్నారు.

ఈ నెల 3వ తేదీన(శనివారం) హైదరాబాద్ లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కొత్త చట్టంలో నిధుల పంపిణీ విధానం ద్వారా రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపే ప్రతి పాదన అమలు సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న 100 శాతం కేంద్ర నిధుల విధానం స్థానంలో 60:40 నిష్పత్తి ని తీసుకురావడం వల్ల ఉపాధి కూలీలకు పనిది నాలు తగ్గే ప్రమాదం ఉందని, ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ మునుపటిలాగే 100 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే జులై 30, 2025న పంచాయ తీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క నిర్వహించిన చర్చల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు అమలులో ఉన్నవి కలాంగుల, వితంతు పింఛన్లను నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వాటిని తిరిగి కొనసాగించి సంక్షేమ పథకాల పరిధిలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

జనవరి 3న జరిగే ఇంద్రపార్క్ ధర్నాలో రాష్ట్రం లోని ప్రతి గ్రామపంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లు ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు