- సీఎం రూ.కోట్ల విలువైన భూములు స్వాహ చేశారు
- ‘విజయభేరి’ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శ
వేద న్యూస్, రాజేంద్రనగర్:
రాజేంద్రనగర్ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని, రూ.కోట్లు విలువైన భూములు స్వాహా చేశారనీ టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం అభ్యర్థి కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో శంషాబాద్ తోండుపల్లి గ్రామం ఎంపిఎస్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించిన విజయభేరి సభకు ఆయన హాజరై మాట్లాడారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మీ భూములని గుంజుకుని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారన్నారు. కొకపెట్లో వందల కోట్లు అమ్ముకున్నారని చెప్పారు.
ప్రభుత్వ భూములు అమ్ముకుంటే పేద ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ ఇళ్లు ఎక్కడ కట్టిస్తారని అడిగారు. రైతు బంధు అంటూ రైతులు చచ్చినాక రూ.5 లక్షలు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించాలన్నారు. శంషాబాద్ అభివృద్ది చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, నాడు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు.
కేసీఆర్ మందు షాపులు తెచ్చి ఓ పక్క తగుమని చెప్తూ, మరో పక్క లాక్కున్నారన్నారు. ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ఇక ఆయన ఆటలు చెల్లావన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ ను కలవడమే కష్టమని, ఇక నియోజక వర్గానికి నిధులు ఎలా తీసుకువస్తారని అడిగారు. అడపడచుల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు, తులం బంగారం సోనియమ్మ ఇస్తుందని వెల్లడించారు.
వృద్ధులకు రూ.4 వేల పించన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తుందన్నారు. చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలోని డివిజన్ లలో ప్రజా సమస్యలు, హాస్పిటల్, డ్రైనేజీ, బస్టాండ్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని అభ్యర్థి నరేందర్ ఆన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే వెంటనే ప్రజా సమస్యలు, కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు జక్కల ఎల్లయ్యతో పాటు పలువురు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి నాయకులు ఆహ్వానించారు.