= బీసీ వాదం బలపడితే.. కొండా సీఎం కావడం అసాధ్యమా..!
= బీసీ నాయకత్వాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్‌కూ బీఆర్ఎస్ గతేనా?
= ఈటల బర్తరఫ్‌తో బీఆర్ఎస్కు దెబ్బ.. కొండా ఉద్వాసనతో కాంగ్రెస్‌కు గుబులు
= కొండా బీసీ పార్టీ పెడితే..? తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలన్నీ తలకిందులే
= తెలంగాణ తొలి బీసీ సీఎంగా చరిత్రలో నిలిచే అవకాశం
= వైఎస్ఆర్, కేసీఆర్ హయాంలోనూ బలమైన నేతలుగా ముద్ర
= జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కీలక పాత్ర
= ఎప్పటికీ చెరగని కొండా దంపతుల చరిష్మా
= ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలంటున్న క్యాడర్
= ప్లాన్ తో ముందడుగేస్తే లక్ష్య సాధన కష్టం కాదంటున్న విశ్లేషకులు
= అందరి సహకారంతో ముందుకు సాగాలంటూ ఆకాంక్ష
= ఢిల్లీ పెద్దల పదవులకు తలొగ్గితే భవిష్యత్తులో సీన్ రిపీట్ అయ్యే అవకాశం
= ఆచితూచి అడుగేయాలంటున్న కొండా అభిమానులు
వేద న్యూస్, (ఎల్.కే ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో రకరకాల చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. కొండా మురళికి రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి అంటూ, సురేఖకు కేబినెట్ హోదాతో ఏదో ఒక పోస్టు ఇస్తారంటూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాగా, తెలంగాణ రాజకీయాల్లో ‘బీసీ’వాదం హాట్ టాపిక్‌గా ఉన్న ఈ సందర్భంలో.. సంకల్పంతో ముందుకెళ్తే చరిత్రలో నిలిచే అవకాశం కొండా దంపతులకు దక్కనుంది. ‘బీసీ పార్టీ’దే కీ రోల్‌గా పాలిటిక్స్ పరిభ్రమిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా సాగితే రాష్ట్ర ‘తొలి బీసీ సీఎం’గా చరిత్రలో నిలిచే చాన్స్ డెఫినెట్‌గా ఉండొచ్చనే వాదనలూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ అయిన తర్వాత కాలంలో బీఆర్ఎస్ పవర్ కోల్పోయింది. తాజాగా కొండా సురేఖ ఉదంతం అందరికీ తెలిసిందే. ఇక భవిష్యత్‌లో కాంగ్రెస్‌కూ అదే గతి పడుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం ఇవ్వనుంది.
పదవులు కాదు.. ప్రజాదరణే ‘బలం’
ప్రస్తుత తెలంగాణలో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే వైఎస్ఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ కొండా దంపతులకు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపోటములతో సంబంధం లేకుండా తమను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలను కాపాడుకోవడంలో ముందుండే నేతలుగా ‘కొండా దంపతులకు’ పేరుంది. విస్తృత ప్రజాదరణ కలిగిన లీడర్లుగా వారు చలామణిలో ఉన్నారు. అయితే, మినిస్టర్ పోస్టు నుంచి సురేఖను తొలగించిన తర్వాత కేబినెట్ హోదా పదవి, రాష్ట్రా స్థాయి చైర్మన్ పోస్టు అంటూ.. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు అంటూ వార్తలొస్తున్నాయి. అయితే, అవేవీ అయినా ఈ కొండా దంపతులు చూడని పదవులు కావు.
‘బీసీ పార్టీ’ ఏర్పాటు చేస్తే..
బీసీ చైతన్యాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ రకమైన ప్రచారం జరుతుందన్న వాదనా ఉన్నది. ఈ సందర్భంలో కొండా దంపతులు అధిష్టానం మాట విని తలొగ్గితే.. మళ్లీ అవమానాలు ఎదురుకాకుండా ఉంటాయా? ఇలా ఎన్ని అవమానాలు భరించాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పగలరు..? అలా కాకుండా తెగించి కొట్లాడితే.. ‘బీసీ పార్టీ’ ఏర్పాటు చేసి ముందుకెళితే.. తొలి బీసీ సీఎంగా చరిత్రలో నిలిచే అవకాశం ఏర్పడొచ్చు. కాలం కలిసొస్తే భిన్న పార్టీలలోని బీసీ లీడర్లు ఆయా సందర్భాలలో అంశాల ప్రాతిపదికగా ఏకమై కూటమిగా అడుగులు పడొచ్చు. అందుకు ఇరువైపులా చొరవ, సంప్రదింపులు కీలకం కావచ్చు. అయితే, రాజకీయ అధికారం దిశగా బలమైన ప్రయాణానికి సమాయత్తం కావడం ముఖ్యం.
బీసీ వర్గాల సహకారంతో..
మున్ముందు ప్రస్తుత బీఆర్ఎస్లో ఇంకెన్ని చీలికలు వస్తాయో? కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడుతుందో? ఇక ఢిల్లీ కేంద్రంగా నిర్ణయాలు జరిగి రాష్ట్రంలో అతీగతీ లేని దిశలో సాగుతున్న బీజేపీ.. ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖచిత్రంగా ఉన్నది. ఈ టైమ్‌లో తెలంగాణలో ‘బీసీ పార్టీ’ రాజకీయ తెర మీదకు రాగలిగితే.. ప్రజలలో ఉన్న బీసీ చైతన్యం కలగలిసి లక్ష్యం దిశగా ముందుకు సాగవచ్చు. ‘బీసీ నినాదం’తో సబ్బండ వర్గాల సహకారంతో బహుజన తెలంగాణ లక్ష్యంగా, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారం సాధనకు కలిసొచ్చే నాయకులను కలుపుకుని ముందుకు సాగాలి. కొండా దంపతులు ఇందుకు చొరవ తీసుకుని ముందుకు సాగి.. బీసీ లీడర్లు ఈటల రాజేందర్, మధు యాష్కి, తీన్మార్ మల్లన్న వంటి వారితో పాటు బీసీ, కుల, మేధావులు, ప్రొఫెసర్ల, జర్నలిస్టుల సంఘాలు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. ‘బీసీ నినాదం’ ఎత్తుకుని ఆచరణలో అందుకు భిన్నంగా వెళ్తున్న కాంగ్రెస్ అధిష్టాన తీరును ప్రజలకు అర్థమయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అర్హత ఉన్న కీలక బీసీ లీడర్లు వీహెచ్, డీ.శ్రీనివాస్, సీ.జగన్నాథరావు, మదన్మోహన్, రాజారామ్ వంటి వారికి అత్యున్నత స్థాయిలో పదవులు లభించలేదనే వాదనలూ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రజలలో ఉన్న ‘బీసీ’ చైతన్య నాడిని గుర్తించి ‘కొండా’ దంపతులు ముందుకెళ్తారో చూడాలి.
పార్టీలతో సంబంధం లేని ప్రజాదరణ
తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా తిరుగులేని ప్రజాదరణ, బలమైన మాస్ ఫాలోయింగ్‌ను నిలబెట్టుకున్న ఏకైక రాజకీయ శక్తిగా కొండా దంపతులు ప్రత్యేక గుర్తింపు పొందారు. క్షేత్రస్థాయిలో కొండా మురళి వ్యూహాలు, ప్రజాక్షేత్రంలో కొండా సురేఖ మాస్ లీడర్షిప్, ప్రత్యర్థులను ఎదిరించే దూకుడు శైలి వారికి రాష్ట్రంలోనే తిరుగులేని సొంత సైన్యాన్ని అందించాయి. స్థానిక సంస్థల స్థాయి నుంచి మొదలై ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ క్యాబినెట్‌తో పాటు తెలంగాణలోనూ మంత్రిగా సురేఖ బాధ్యతలు చేపట్టడం, రెండుసార్లు ఎమ్మెల్సీగా కొండా మురళి జిల్లా రాజకీయాలను శాసించడం వీరి సుదీర్ఘ రాజకీయ ఎదుగుదలకు నిదర్శనం. రాష్ట్రంలోనే అత్యంత భారీ సంఖ్యాబలం కలిగిన రెండు కీలక బీసీ సామాజిక వర్గాల బలమైన మద్దతు వీరికి అండగా నిలవడమే కాకుండా, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ వంటి ఏ పార్టీలో ఉన్నా తమ వ్యక్తిగత ఇమేజ్‌తో భారీ మెజారిటీలు సాధిస్తూ, క్లిష్ట సమయాల్లో నమ్ముకున్న సిద్ధాంతాలకు, నేతలకు కట్టుబడి రాజీనామాలు సైతం చేసిన తెగువ కొండా ఫ్యామిలీని బడుగు, బలహీన వర్గాల గుండెల్లో శాశ్వత ప్రజాదరణ కలిగిన తిరుగులేని నాయకత్వంగా నిలబెట్టింది.
