- తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొండా సురేఖ
- వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యం
వేద న్యూస్, వరంగల్:
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18 వ డివిజన్ లేబర్ కాలనీలో ‘గడపగడపకు సురేఖమ్మ’ అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు అన్ని కాలనీలలో గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలుస్తూ..ఆప్యాయంగా పలకరించారు. జనం సమస్యలు తెలుసుకుంటూ సోనియాగాంధీ ప్రకటంచిన ఆరు గ్యారంటీ పథకాలను ఇంటింటి ప్రచారంలో వివరించారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అందిస్తూ..ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వెల్లడించారు. కాంగ్రెస్ గెలుపునకు యువత కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అందరూ బలపరచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో కూరుకుపోయిందని..ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేక పోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అట్టడుగు వర్గాల నుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏమి అభివృద్ధి జరగలేదని, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కంటెస్ట్ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు, కొండ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.